తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నారనే ప్రచారం కొంతకాలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నారనే ప్రచారం కొంతకాలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. 2014 తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్.. ఐదేళ్లు పూర్తికాకుండానే 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అది టీఆర్ఎస్‌కు కలిసివచ్చింది. గతంతో పోలిస్తే టీఆర్ఎస్ విజయం సాధించిన సీట్ల సంఖ్య కూడా పెరిగింది. అయితే గతంలో మాదిరిగానే ఈసారి కూడా కేసీఆర్.. ముందస్తు ఆలోచనలో ఉన్నారని.. ఇప్పటికే ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ సర్వేలు చేయిస్తుందని వార్తలు వస్తున్నాయి. 

ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. అక్కడ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకుని.. పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీ నామా నాగేశ్వరారవు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గన్నారు. 

ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీకి ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున పోరాటానికి సిద్దంగా ఉండాలని నాయకులకు సూచించారు. అంతేకాకుండా జిల్లాలో పార్టీని మరింతగా బలోపేతం చేసే విధంగా నాయకులకు కేటీఆర్ మార్గనిర్దేశనం చేశారు. అవసరమైన చోట కొన్ని మార్పులు తప్పవని స్పష్టం చేశారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని చెప్పారు. కుమ్ములాటలు మానేసి, వచ్చే ఎన్నికల్లో పార్టీ భవిష్యత్తు మరింత మెరుగుపరిచేలా పని చేయాలని సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10కి 10 స్థానాలను గెలుచుకోవాలని చెప్పారు. గత ఎన్నికల్లో ఇతర జిల్లాల్లో 13 సీట్లుంటే 12 గెలుచుకున్నామని, ఖమ్మంలో మాత్రం 10 సీట్లుంటే ఒకటి మాత్రమే గెలిచామని.. ఈసారి ఆ పరిస్థితి మారాలని స్పష్టం చేశారు.

పువ్వాడ అజయ్‌కుమార్‌తో సీనియర్‌ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య కొనసాగుతున్న వాగ్వాదంపై ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. తుమ్మల నాగేశ్వరరావు అనుభవం ఉపయోగించుకోవాలన్నారు. జనంలో ఉన్న పొంగులేటి వంటి నాయకులను కలుపుకుని పోవాలని సూచించారు. జిల్లా నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు వారం రోజుల్లో ముఖ్య నేతలతో హైదరాబాద్‌లో మరో సమావేశం ఏర్పాటు చేస్తానని కేటీఆర్‌ తెలిపారు. తగిన సమయంలో పార్టీ తుమ్మల, పొంగులేటిలకు తప్పకుండా ప్రతిఫలమిస్తుందని ఆయన ఇద్దరు నేతలకు హామీ ఇచ్చారు. ఇద్దరికీ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని కేటీఆర్ చెప్పినట్టుగా సమాచారం. 

ఇక, కేసీఆర్ జాతీయ స్థాయిలో కొత్త పార్టీని ప్రారంభించడంపై ఆయన ప్రస్తావిస్తూ జూన్ 18 లేదా 19 తేదీల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ నాయకులతో చెప్పినట్టుగా తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీకి 2023 డిసెంబర్ కన్నా ముందుగా ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే కేసీఆర్ ఎన్నికల ప్రణాళికలు రచిస్తున్నారని.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించి మరోమారు అధికారం చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో ఎన్నికల ముగిసిన వెంటనే.. పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా చక్రం తిప్పాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ముందస్తు ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులను సిద్దం చేసేందుకేనని వారు అభిప్రాయపడుతున్నారు.