ఓటుకు నోటు కేసు: మంత్రి కేటీఆర్ పై మత్తయ్య సంచలన ఆరోపణ

ఓటుకు నోటు కేసు: మంత్రి కేటీఆర్ పై మత్తయ్య సంచలన ఆరోపణ

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తనను కోవర్టుగా మార్చేందుకు ఐటి శాఖ మంత్రి కేటి రామారావు గన్ మెన్ ప్రయత్నించారని కేసులో నిందితుడు జెరూసలెం మత్తయ్య ఆరోపించారు. కోవర్టుగా మారనందుకు తనను బెదిరించారని ఆయన మంగళవారం మీడియాతో చెప్పారు. 

ఓటుకు నోటు కేసుపై, ఆ కేసులో ఫోన్ ట్యాంపరింగ్ పై సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ సాయంతో చాలా మందిని కొనుగోలు చేసి ఉంటారని ఆయన అన్నారు. ఎవరెవరిని కొనుగోలు చేసే ప్రయత్నం చేశారో వెల్లడించాలని కూడా ఆయన డిమాండ్ చేసారు. 

తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలను కూడా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారని అన్నారు. టీడీపి, టీఆర్ఎస్ తనను బలిపుశువును చేయాలని ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాంపరింగ్ పై ఆర్టీఐ వివరాలు ఇవ్వడానికి నిరాకరించారని అ్నారు. 

తనపై కొట్టేసిన కేసును తిరిగి తెరిచి వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ కు తన నుంచి పది ప్రశ్నలు అంటూ ఆయన పలు ఆరోపణలు చేశారు. ఓటుకు నోటు కేసుపై తిరిగి సమీక్ష చేసినందుకు కేసిఆర్ కు కృతజ్ఞతలు అని ఆయన అన్నారు. కుట్రపూరితంగా కేసు పెట్టి తనను చార్జిషీటులో ఎ4గా చేర్చారని ఆయన అన్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలందరితో జరిపిన సంభాషణలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేసులో క్రైస్తవ నామినేటెడ్ ఎమ్మెల్యేలను బలపశువును చేశారని అన్నారు. తన తమ్ముడి బంధువులను కొట్టించడంపై దర్యాప్తు చేయించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. స్టింగ్ ఆపరేషన్ ను మీడియాకు ఎందుకిచ్చారో చెప్పాలని మత్తయ్య అన్నారు.

ఓటుకు నోటు కేసుపై ముఖ్యమంత్రి కేసిఆర్ మంగళవారం కూడా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. భూదందాలపై కూడా ఆయన తీవ్రంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలోని భూదందాలపై వారంలోగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos