హైదరాబాద్: తెలంగాణ శానససభ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా వైరస్ సోకడంపై మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మాస్క్ పెట్టుకోవాలని తాను పద్మారావుకు చెప్పానని, ఆ మర్నాడే పద్మారావుకు కరోనా వైరస్ వచ్చిందని కేటీఆర్ అన్నారు. 

కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంపై కూడా కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరోనా మరణాల కన్నా లాక్ డౌన్ వల్ల సంభవించే మరణాలే ఎక్కువగా ఉంటాయని ఆయన అన్నారు. కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ పైశాచికానందం పొందుతున్నాయని ఆయన వ్యాఖ్యనించారు. 

కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. తాము కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయవచ్చునని, కానీ ఇది సరైన సందర్బం కాదని గుర్తించి మాట్లాడడం లేదని ఆయన అన్నారు.

ఎక్కడో ఒక్క ప్రభుత్వం తప్పిదాలు కూడా ఉంటాయని, వాటిని పట్టుకుని బూచీగా చూపడం సరి కాదని కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు ప్రజలకు ధైర్యం చెప్పాలని, లోపాలున్నాయని, లేవనడం లేదని, ప్రపంచమంతా లోపాలున్నాయని, అమెరికా లాంటి అగ్రరాజ్యంలో కూడా చికిత్సకు సంబంధించిన మౌలిక సదుపాయాలు లేవని ఆయన అన్నారు. 

ప్రభుత్వానికి నైతిక స్థయిర్యం అందించాలని, రాజకీయాలు చేయాలనుకుంటే ఏడాది తర్వాతనో.. ఆ తర్వాతనో చేసుకోవచ్చునని ఆయన అన్నారు.