ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై కేటీఆర్ కామెంట్.. ‘ఐరాస వెంటనే జోక్యం చేసుకోవాలి’
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. గత రెండు వారాల్లో ఈ యుద్ధంలో సుమారు 4,500 మంది మరణించారన్న వార్త తనను బాధిస్తున్నదని తెలిపారు. ఐరాస వెంటనే జోక్యం చేసుకుని చర్చల ద్వారా సమస్య పరిష్కరించాలని కోరారు.
హైదరాబాద్: అక్టోబర్ 7వ తేదీన హమాస్ సాయుధులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి మారణహోమం సృష్టించారు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఎవరు కనిపిస్తే వారిని చంపేశారు. వందకు పైగా మందిని బంధించి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ రంగంలోకి దిగింది. హమాస్‌ను తుడిచిపెట్టే వరకు యుద్ధం చేస్తామని ప్రకటించి వైమానిక దాడులకు దిగింది. ఇప్పుడు భూతల దాడికి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి సుమారు 4000కు పైగా ప్రజలు మరణించారు.
తాజాగా, ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. నిన్న ఆయన ట్వీట్ చేస్తూ వీలైనంత వేగంగా కాల్పుల విరమణ జరగాలని ఆశించారు. వెంటనే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని పరిష్కరించాలని కోరారు.
బుధవారం గాజాలోని హాస్పిటల్ పై బాంబు పడింది. దీంతో వందలాది మంది దుర్మరణం చెందారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం హాస్పిటళ్లను టార్గెట్ చేయరాదు. కానీ, గాజాలోని హాస్పిటల్ కూడా దాడికి గురైంది. దీనిపై ప్రపంచ దేశాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. అమెరికా మాత్రం హాస్పిటల్ పై ఇజ్రాయెల్ దాడి చేయలేదని వాదించింది. గాజాలో హాస్పిటల్ పై బాంబు దాడిని కేటీఆర్ ప్రస్తావించారు.
Also Read: రష్యా, భారత్, మధ్యలో చైనా.. చమురు దిగుమతుల లావాదేవీల్లో యువాన్ మెలిక
గాజాలోని హాస్పిటల్ పై బాంబు పడిన ఘటనలో వందలాది మంది మరణించారన్న వార్త తనను కలత పెట్టిందని కేటీఆర్ తెలిపారు. ఈ రెండు వారాల్లో సుమారు 4,500 మంది మరణించారన్న వార్త బాధిస్తున్నదని వివరించారు. ఉభయ పక్షాల చర్యలను సమర్థించడం చాలా కష్టమని, అంతేకాదు, వారి చర్యల వల్ల మానవ సంక్షోభం ఏర్పడుతున్నదని పేర్కొన్నారు.
వెంటనే కాల్పుల విరమణ పిలుపునకు తాను కట్టుబడి ఉంటానని, గాజా ప్రజలకు వెంటనే సహకారం అందించే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్ వివరించారు. హింసకు దూరంగా జరగాలని కోరారు. హింసలో ప్రమేయం తీసుకోవడానికి బదులు చర్చలు, దౌత్యం విధానంలో పాలస్తీనా ప్రజల ఆశలను పూర్తి చేయాలని, ఇజ్రాయెల్ భద్రతాపరమైన చర్యలకూ పరిష్కారాన్ని చూడాలని వివరించారు. అంతేకాదు, ఐరాస వెంటనే జోక్యం చేసుకుని చర్చల ద్వారా పరిష్కారానికి దోహదడాలని విజ్ఞప్తి చేశారు.