Asianet News TeluguAsianet News Telugu

రష్యా, భారత్, మధ్యలో చైనా.. చమురు దిగుమతుల లావాదేవీల్లో యువాన్ మెలిక

ఉక్రెయిన్ పై యుద్ధం కారణంగా రష్యా చమురుకు అంతర్జాతీయ విపణిలో డిమాండ్ లేకుండా పోయింది. రష్యా మనుగడ కోసం ఈ చమురును చౌకగా మిత్ర దేశాలకు అమ్మడానికి నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని భారత్ అందిపుచ్చుకుంది. పశ్చిమ దేశాల హెచ్చరికలను ఖాతరు చేయకుండా దేశ ప్రయోజనాల కోసం రష్యా నుంచి చౌకగా చమురు దిగుమతి చేసుకుంటున్నది. అయితే.. ఇప్పుడు ఈ దిగుమతి వ్యవహారంలో కరెన్సీ సమస్య వచ్చింది. భారీ మొత్తంలో పోగవుతున్న భారత రూపాయి కరెన్సీని ఎలా ఖర్చు పెట్టాలో? ఎలా వినియోగించుకోవాలో రష్యాకు అర్థం కావడం లేదు. దీంతో చైనా యువాన్‌లో చెల్లింపులు జరపాలని భారత్‌ను కోరుతున్నది. కానీ, అందుకు భారత్ సుముఖంగా లేదు.
 

russia demanding india to pay in chinese yuan currency for oil imports transactions kms
Author
First Published Oct 20, 2023, 2:58 PM IST | Last Updated Oct 20, 2023, 2:58 PM IST

సాధారణంగా అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో రష్యా, చైనా సన్నిహితంగా మసులుకుంటాయి. ఒక దేశానికి మరో దేశం స్నేహ హస్తం ఇచ్చేలా చూసుకుంటాయి. ఉక్రెయిన్ పై యుద్ధంతో పశ్చిమ దేశాలు రష్యాను దాదాపు బాయ్‌కట్ చేసినా చైనా మాత్రం ఏదో ఒక రూపంలో బాసటగా నిలుస్తూనే ఉన్నది. మన దేశానికి కూడా రష్యా మంచి మిత్ర దేశం. కానీ పొరుగునే ఉన్న చైనాతో సరిహద్దు విషయమై మనకు ఘర్షణ కొనసాగుతూనే ఉన్నది.

ఉక్రెయిన్ పై యుద్ధంతో రష్యా నుంచి చమురు దిగుమతులను చాలా దేశాలు నిలిపేశాయి. అతిపెద్ద దిగుమతిదారుల్లో ఒకటైన భారత్ మాత్రం రష్యా నుంచి తక్కువ ధరకే దిగుమతులు పెంచుకుంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలను కాదని భారత్ ఈ దిగుమతులు చేసుకుంటున్నది. అమెరికా సహా కొన్ని పాశ్చాత్య దేశాలు అసంతృప్తి వెళ్లగక్కినా దేశ ప్రయోజనాల దృష్ట్యా వెనుకడుగు వేయలేదు. చైనాను అదుపులో పెట్టుకోవడానికి భారత్ కీలకమైన దేశం కావడం వంటి ముఖ్య కారణాల వల్ల పాశ్చాత్య దేశాలు అసంతృప్తి వెళ్లగక్కడానికి మించి మరేమీ చేయలేవు.

ఈ నేపథ్యంలో రష్యా చమురును భారత్ రూపాయి కరెన్సీ ద్వారా దిగుమతి చేసుకుంటున్నది. అయితే.. రష్యాలో రూపాయి కరెన్సీ పెద్ద ఎత్తున పేరుకుపోతున్నది. ఆ కరెన్సీని ఇతర ప్రయోజనాల కోసం వాడుకోవడం రష్యాకు ఇబ్బందిగా మారింది. ఎందుకంటే.. రష్యా నుంచి భారత దిగుమతులే అధికం. అదే చైనా పరిస్థితి వేరు. చైనా నుంచి రష్యా అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నది. దీంతో రష్యా ఇటు రూపాయి, అటు యువాన్ కరెన్సీని బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితిలో పడిపోయింది. ఇందుకోసమే భారత్‌ను చమురు కోసం యువాన్ కరెన్సీలో లావాదేవీలు జరపాలని ఒత్తిడి చేస్తున్నది. కానీ, సరిహద్దు గొడవ కారణంగా చైనాతో విభేదాల్లో ఉన్న భారత్ మాత్రం అందుకు సుముఖంగా లేదు. చైనాతో సత్సంబంధాలు లేని కారణంగా యువాన్ కోసం ప్రయత్నాలు చేసే పరిస్థితి లేదు.

Also Read: ఇజ్రాయెల్-పాలస్తీనా వార్ ఎఫెక్ట్ : 5 శాతం పెరిగిన క్రుడయిల్ ధరలు .. ఇండియాలో పెట్రోల్ ధర పెరగనుందా ..?

గతంలో ఇండియన్ ఆయిల్ కార్ప్ ఒకసారి యువాన్ కరెన్సీలో పేమెంట్ చేసింది. అప్పటి నుంచి భారత్ యువాన్ చెల్లింపులపై ఆంక్షలు విధించింది. మన దేశంలో 70 శాతం ఆయిల్ రిఫైనర్లు ప్రభుత్వరంగంలోనివే. కాబట్టి, ఈ ఆంక్షలతో రష్యాకు యువాన్‌లో చెల్లింపులు జరపడం కష్టమే. అయితే.. ప్రైవేటు కంపెనీలు యువాన్‌లో జరపడానికి వీలు ఉన్నది.

రష్యా ఆయిల్ కంపెనీలకు భారత రూపాయి, యూఏఈ దిర్హమ్ సహా ఇతర కరెన్సీల్లో చెల్లింపులు జరుపుతున్నాయి. ఇందులో యువాన్ కరెన్సీ కూడా ఉన్నది. కానీ, రష్యా అత్యధికంగా చైనాపై ఆధారపడటం మూలంగా యువాన్ కరెన్సీనే లావాదేవీలో ప్రధానంగా ఉండాలని చెబుతున్నది.

యువాన్ కరెన్సీని పాపులర్ చేయడం పరోక్షంగా భారత రూపాయిపై ప్రతికూల ప్రభావాన్ని వేసే ముప్పు ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్రిక్స్ కూడా ఇటీవలే కామన్ కరెన్సీకి ప్రతిపాదించగా ఇండియా వ్యతిరేకించింది. ఈ ప్రతిపాదన ద్వారా చైనా యువాన్‌కు భారత్ ఆమోదం తెలుపాల్సి వచ్చే స్థితి ఉండేది.

రష్యా, భారత్‌ల మధ్య మారకానికి సంబంధించి కొన్ని నెలలుగా ఆందోళనలు నెలకొన్నాయి. చివరికి దీని పరిష్కారం ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉన్నది. ప్రస్తుతానికి భారత్ రష్యా నుంచే అత్యధిక చమురు దిగుమతి చేసుకుంటున్నది. ఒక వేళ ఈ చమురు దిగుమతులు కరెన్సీల కారణంగా నిలిపేయాల్సి వస్తే చమురు ధరల్లో మార్పు తప్పకపోవచ్చని విశ్లేషిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios