Asianet News TeluguAsianet News Telugu

వర్కింగ్ ప్రెసిడెంట్: కేటీఆర్ ప్రస్థానం ఇదే

కల్వకుంట్ల తారకరామారావు సింపిల్‌గా కేటీఆర్. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు. పదేళ్లకు ముందు వరకు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ పేరు వినిపించలేదు. 

KTR biography
Author
Hyderabad, First Published Dec 14, 2018, 2:23 PM IST

కల్వకుంట్ల తారకరామారావు సింపిల్‌గా కేటీఆర్. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు. పదేళ్లకు ముందు వరకు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ పేరు వినిపించలేదు. తెలంగాణలో ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ రెండంకెల జీతాన్ని అందుకుంటూ జీవితాన్ని నడుపుతున్నారు.

ఒరాకిల్, జావా, లాంటి సాఫ్ట్‌వేర్లు తప్పించి రాజకీయాలంటే ఎంటో తెలియని స్థితిలో ఉద్యమంలోకి ప్రవేశించి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించారు. నాటి నుంచి నేటి వరకు రాజకీయాల్లో తన మార్క్‌ను చూపిస్తూ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ దాకా ఎదిగిన కేటీఆర్ జీవితంలోని కొన్ని మలుపులు ఒక్కసారి చూస్తే.

1976 జూలై 24న కేసీఆర్, శోభా దంపతులకు జన్మించిన కేటీఆర్ తన విద్యాభ్యాసాన్ని కరీంనగర్, హైదరాబాద్‌లలో పూర్తి చేశారు. మెడిసిన్ కోసం ఎంట్రన్స్ పరీక్ష రాయగా.. కర్ణాటకలోని ఓ మెడికల్ కాలేజీలో సీటొచ్చింది. కానీ అది ఇష్టం లేక నిజాం కాలేజీలో బీఎస్సీ (మైక్రో బయాలజీ) పూర్తి చేశారు.

అనంతరం పుణే విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ పూర్తి చేశారు.  ఆ తర్వాత అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి మేనేజమ్‌మెంట్ అండ్ ఈ కామర్స్‌లో ఏంబీఏ పట్టా పొందారు. అనంతరం ఇంట్రా అనే సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉద్యోగంలో చేరి.. యూనైటెడ్ స్టేట్స్‌లోనే స్థిరపడేందుకు ప్రణాళికలో ఉన్నారు.

2001లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తండ్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. తాను కూడా ఉద్యమంలో పాలుపంచుకుంటానని కేటీఆర్ ఉత్సాహం చూపించారు. అప్పుడే వద్దని కేసీఆర్ వారించడంతో 2006లో తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర నిర్వర్తించేందుకు 2006లో హైదరాబాద్‌కు వచ్చారు.

2006 నుంచి 2009లో టీఆర్ఎస్‌లో సామాన్య కార్యకర్తగా ఉంటూ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. టీఆర్ఎస్ యూపీఏ ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వైదొలగి ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి.

ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధుల తరపున కేటీఆర్ ఉధృతంగా ప్రచారం చేశారు. అనంతరం 2009లో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి కేకే. మహేందర్ రెడ్డిపై విజయం సాధించి నాటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు.

మరోసారి తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో 2010లో మళ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కెకె. మహేందర్ రెడ్డిపై 68,220 ఓట్ల భారీ మెజార్టీతో కేటీఆర్ గెలిచి సంచలనం సృష్టించారు.

అనంతరం రాష్ట్రవిభజన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి సిరిసిల్ల నుంచి బరిలోకి దిగిన కేటీఆర్.. కాంగ్రెస్ అభ్యర్ధి కొండూరు రవీందర్‌రావుపై 53,004 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో 89,009 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

తనను నాలుగు సార్లు భారీ మెజారిటీతో గెలిపించిన సిరిసిల్లను అనేక రంగాల్లో అభివృద్ధి చేశారు కేటీఆర్. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించారు. తెలంగాణ తొలి కేబినెట్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.

ఆయన సమర్థతను ప్రధాని మోడీతో పాటు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసించారు. కొడుకు శక్తి, సామర్థ్యాలను గుర్తించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తనయుడిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. రాబోయే రోజుల్లో పార్టీని సమర్థవంతంగా, క్రమశిక్షణతో నడిపిస్తారన్న నమ్మకంతోనే కేటీఆర్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios