చంద్రబాబును తొలిసారి మెచ్చుకున్న కేటిఆర్

ktr all praise for naidu first time
Highlights

  • హైదరాబాద్ వేదికగా బాబుపై కేటిఆర్ పొగడ్తల వర్షం
  • హైదరాబాద్ ఐటికి బాబు సేవలు ఘనంగా ఉన్నాయి
  • నేను హైదారబాద్ ఐటికి చేసిందేం లేదు
  • చంద్రబాబు చేసిందే చాలా ఉంది

కేటిఆర్ రాజకీయం మొదలు పెట్టిన నాటినుంచి ఈనాటి వరకు ఏనాడైనా టిడిపి అధినేత చంద్రబాబు గురించి ఒక్క మంచి మాట అన్నా మాట్లాడిండా? చంద్రబాబును ఏనాడైనా మెచ్చుకున్నడా? ఈ ప్రశ్నకు రాజకీయాలపై కొద్దిగా అవగాహన ఉన్నవారెవరైనా నో అని సమాధానం చెబుతారు. ఎందుకంటే కేటిఆర్ నోట ఏనాడు కూడా చంద్రబాబును మెచ్చుకోలేదు. పొగడలేదు.

తెలంగాణ మలివిడత ఉద్యమం మొదలైన కాలంలో కేటిఆర్ అమెరికా నుంచి వచ్చి ఉద్యమంలో పాలుపంచుకున్నారు. స్వతహాగా ఉద్యమ నేత కొడుకు కావడంతో టక టకా ఆయనకు పదవులు వచ్చేశాయి. కేటిఆర్ రాజకీయ జీవితం మొదలు పెట్టిన రోజుల్లో సీమాంధ్ర నేతలపై తీవ్రమైన భాషలో విమర్శలు చేస్తూ మొదలు పెట్టారు. ఆ సమయంలో చంద్రబాబును ఎన్ని మాటలన్నారో కూడా లెక్కేలేదు. ఉద్యమ కాలంలో తెలంగాణ వాదులకు బూస్ట్ ఇచ్చేందుకు సీమాంధ్ర నేతలమీద పరుషమైన భాషలో విమర్శలు చేసే రోజులవి. అందులో కేటిఆర్ కూడా అదేబాటలో నడిచారు. వందలసార్లు చంద్రబాబును కేటిఆర్ తిట్టిండు. దూషించిండు. విమర్శించిండు. తన తండ్రి కేసిఆర్ తో పోటీ పడి మరి చంద్రబాబును విమర్శించిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు.

అంతిమంగా తెలంగాణ వచ్చింది. దాయాది రాష్ట్రం ఎపికి చంద్రబాబు సిఎం అయిండు. తెలంగాణ రాకముందే కాదు తెలంగాణ వచ్చిన మూడున్నరేళ్ల కాలంలో కూడా కేటిఆర్ ఏనాడూ చంద్రబాబు గురించి ఒక్క మంచిమాట మాట్లాడిన దాఖలాలు లేవు. తెలంగాణలో టిఆర్ఎస్ పాలనను రెండు భాగాలుగా విభజించి చూడాలి. అందులో మొదటి భాగం ఓటుకు నోటు కేసు కాకముందుది.. రెండో భాగం ఓటుకు నోటు కేసు తర్వాత కాలం. తొలి భాగంలో టిఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర ఆందోళలో ఉన్న రోజులవి. కేంద్రంలో చంద్రబాబు, బిజెపి స్నేహంతో ఉన్న ప్రభుత్వం ఉండడంతో టిఆర్ఎస్ సర్కారుకు ఏమైనా ప్రమాదం తెచ్చిపెడతారా అన్న ఆందోళన ఉండే  రోజులవి. దీంతో తొలి భాగంలో ఏనాడూ కేటిఆర్ నోట చంద్రబాబు గురించి పాజిటీవ్ మాటలు రాలేదు.

ఇక రెండో భాగంలో కూడా చంద్రబాబు గురించి పాజిటీవ్ గా ఏనాడూ మాట్లాడలేదు కేటిఆర్. కానీ పరిస్థితులు అనూహ్యంగా మారిపోతున్నాయి. పాత శత్రువులు మిత్రులయ్యే రోజులొస్తున్నాయి. పాత కుల వైరం మాసిపోతున్నది. ఇప్పటికే తెలంగాణలో టిడిపి, టిఆర్ఎస్ కలిసిపోతాయని, రానున్న 2019 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం మొదలైంది. ఈ వ్వవహారంలో కేసిఆర్ ఒక అడుగు ముందుకేసి సీమాంధ్రలో పరిటాల సునీత కొడుకు పెళ్లికి హాజరు కావడం, చండీయాగం చేసినప్పుడు బాబును ఆహ్వానించడం జరిగిపోయాయి. తాజాగా తెలంగాణలో పెద్ద పెద్ద లీడర్లంతా టిడిపిని వీడి కొందరు టిఆర్ఎస్ వైపు రాగా రేవంత్, ములుగు సీతక్క లాంటి నేతలు కాంగ్రెస్ బాట పట్టారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ టిడిపిలో లీడర్లు కరువై కేడర్ మాత్రమే మిగిలిన వాతావరణం నెలకొంది. ఇక కమ్మ, వెలమ కులాల మధ్య వైరం కూడా తగ్గిపోతున్నది. ఆ రెండు కులాల మధ్య స్నేహం చిగురిస్తూనే ఉన్నది. ఇప్పుడు ఆ బంధం బలపడి వెల్ కమ్ గ్రూపు గా రూపాంతరం చెందుతున్న వాతావరణం కూడా ఉంది. అందుకే కేటిఆర్ స్వరం మారింది. తిట్ల వర్షం కురిపించిన చంద్రబాబుపై తొలిసారి పొగడ్తలు షురూ అయ్యాయి.

బాబును ఏమని మెచ్చుకుండంటే ?

గురువారం హైటెక్ సిటీలో జరిగిన టెక్‌ మహీంద్రా ఎంఐ-18 వార్షిక ఆవిష్కరణ దినోత్సవానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టెక్‌ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని, ఉపాధ్యక్షుడు ఏఎస్‌ మూర్తి, నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ డేబ్జానీ ఘోష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెక్‌ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానమిచ్చారు.

ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్‌కు స్థానం కల్పించిన ఘనత చంద్రబాబుదే. హైదరాబాద్‌కు ఐటీ పరిశ్రమలు రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రపంచంలో ఐటీ హబ్‌గా హైదరాబాద్‌ను నిలపడంలో చంద్రబాబు కృషి అమోఘం. ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్‌ లాంటి సంస్థలు హైదరాబాద్‌కు రావడంతో నా కృషి ఏమీ లేదు. ఆ క్రెడిట్‌ అంతా చంద్రబాబుకే దక్కుతుంది.

17ఏళ్లలో మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, యాపిల్‌ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి భవిష్యత్తులో బాగా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్‌ ఒక్కరోజులో అభివృద్ధి చెందలేదని.. ఈ నగరానికి 450ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. కేటిఆర్ ఉన్నట్లుండి ఇలా చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించడం పట్ల తెలంగాణ, ఎపి రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది.

loader