కలిసి రాని కాలం దాపురించినప్పుడు అనుచరులే పిండాలు సిద్ధం చేస్తారు! అంటూ కోట్ల వెంకటేశ్వర రెడ్డి రాసిన కవిత  ' (అ)సుయోధనా! ' ఇక్కడ చదవండి : 

పిండం పెట్టడానికి ఎవరికైనా
భక్తో రక్త సంబంధమో ఉండాలి!

మాట జారవిడిచేటప్పుడు
పద బంధాల పరమార్థమెరగాలె!

చప్పట్లకు ఆశపడి నోరు జారితే
నెత్తి మీద కాకి తన్ని పోతది!

ఇంకా యుద్ధ శంఖారావం మ్రోగలే
అప్పుడే నిరాశోన్మత్త ప్రేలాపనలేల?!

కలిసి రాని కాలం దాపురించినప్పుడు
అనుచరులే పిండాలు సిద్ధం చేస్తారు!

జన క్షేత్రాల్లో కలియ తిరిగేటప్పుడు
ఆయుధాలు వృధాగా చేజార్చుకో రాదు!

కర్ణుడు మొనగాడే ఎవరు కాదంటారు
అధర్మం చెంత చేరి నిరాయుధుడైండు!

అర్ధ రథులతో వృద్ధ యోధులతో
ఎవరూ యుద్ధం గెలవ లేరు!

(అ)సుయోధనా! చూస్తూనే ఉన్నాం
నీది అనుక్షణ మరణ యాతన!!