భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావుతో పాటు ఆయన తోడళ్లుడు ఎడవల్లి కృష్ణ కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే చివరకు కొత్తగూడెం కాంగ్రెస్ టికెట్ ను వనమాకు కేటాయిస్తూ అదిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో ఎడవల్లికి భంగపాటు తప్పలేదు. 

అయితే కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా కృష్ణ పోటీకి దిగనున్నాడన్న ప్రచారం నేపథ్యంలో ఆయన్ని బుజ్జగించేందుకు వనమా తనయులు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో
కృష్ణ ఇంటివద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. ఆయన అనుచరులు వనమా కొడుకులను కృష్ణ ఇంట్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. అయినా కూడా వారు వెనక్కి తగ్గకుండా ఇంట్లోకి ప్రవేశిస్తుండటంతో కృష్ణ భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఇంట్లోకి వస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. దీంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారింది. 

చివరకు పోలీసులు వచ్చి వనమా తనయులను అక్కడి నుంచి పంపిచేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఆ వెంటనే ఎడవల్లి కృష్ణ సీపిఎం పార్టీలో చేరి బిఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీచేయనున్నట్లు ప్రకటించాడు. దీంతో కొత్తగూడెంలో పోటీ రసవత్తరంగా మారింది.