మహారాష్ట్రలోని పుణేలో కోరుట్లకు చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే. కోరుట్లకు చెందిన పిట్ల శేషు-జ్యోతి దంపతుల కుమార్తె, మౌనిక హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది.

శేషు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లగా.. తల్లితో కలిసి మౌనిక కోరుట్లలోనే ఉంటోంది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం పుణేలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో ఆమె అక్కడే ఉంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం మౌనిక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లి జ్యోతికి సమాచారం అందింది.

కాగా, ఇప్పుడు చేసే ఉద్యోగంలో జీతం తక్కువగా ఉండటంతో వేరే కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు హాజరైనట్లు సమాచారం. అదే రోజు సాయంత్రం ఇంటర్వ్యూలో సక్సెస్ కాలేదని తల్లికి మౌనిక ఫోన్‌లో చెప్పి బాధపడినట్లుగా సమాచారం.

అనంతరం ఆమె సెల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పుణే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మౌనిక మృతితో తల్లిదండ్రులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు.