హైదరాబాద్:  తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంపై మాజీ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను బట్టి మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.  టీఆర్ఎస్ కు తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం ఉందని కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు. 

అటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం తాను, ఈటల రాజేందర్, మరికొంత మంది ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేసీఆర్ మీద టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చాలా వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులు తమతో టచ్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు. 

టీఆర్ఎస్ మీద పోరాటం చేసే పరిస్థితిలో కాంగ్రెసు, బిజెపిలు లేవని కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు. తమ ఆలోచనలకు కాంగ్రెసు ఎంపీ రేవంత్ రెడ్డి మద్దతు కూడా ఉందని ఆయన చెప్పారు. మరో రెండు నెలల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆయన చెప్పారు. షర్మిలకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అనుకోవడం లేదని ఆయన అన్నారు. 

ఈటల రాజేందర్ మీద తీవ్ర అగ్రహానికి గురైన కేసీఆర్ తీవ్రమైన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. దీంతో ఈటల రాజేందర్ వివిధ వర్గాలతో, ప్రముఖులతో చర్చలు జరుపుతున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన  ఓ మహిళా నేత కూడా ఈటల రాజేందర్ ను ఇటీవల కలిసినట్లు తెలుస్తోంది.

జిల్లా పరిషత్తుగా పనిచేస్తున్న ఆ మహిళా నేత చాలా కాలంగా కేసీఆర్ మీద అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను కేసీఆర్ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. దీంతో ఆమె ఈటల రాజేందర్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.