చిట్టెక్క కోసం ప్లాన్: కేసీఆర్ కు కొండా దంపతుల సవాల్

Konda Surekha couple plans for daughter
Highlights

కొండా దంపతులు తమ కూతురు సుస్మితా పటేల్ ను కూడా రంగంలోకి దింపుతున్నారు.

వరంగల్: కొండా దంపతులు తమ కూతురు సుస్మితా పటేల్ ను కూడా రంగంలోకి దింపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) శాసనసభ్యురాలు కొండా సురేఖ, ఆమె భర్త కొండ మురళి తమ కూతురు సుస్మితకు భూపాలపల్లి టికెట్ ఇవ్వాలని, లేదంటే పార్టీని వీడుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకే సవాల్ విసురుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సుస్మిత పటేల్ ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అందుకు కొండా యువసేన, చిట్టెక్క యువసేనలు ఏర్పాటయ్యాయి. సుస్మిత ముద్దు పేరు చిట్టెక్క. పైగా, తాను భూపాలపల్లి నుంచి పోటీ చేస్తానని కేసిఆర్ తో ప్రమేయం లేకుండా సుస్మిత ప్రకటించారు కూడా. 

భూపాలపల్లి నుంచి అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొండా దంపతులు ఆయనను కూడా లక్ష్యంచేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. కొండా దంపతులు భూపాలపల్లి నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించి ఆయనో వీక్ లీడర్ అంటూ నియోజకవర్గం ప్రజలతో బహిరంగంగానే మధుసూదనాచారిపై గురి పెట్టారు. 

సుస్మిత తన భర్తతో కలిసి హైదరాబాదులో ఆస్పత్రి నడుపుతున్నారు. వీలైనప్పుడల్లా భూపాలపల్లి వెళ్లి వస్తున్నారు. భూపాలపల్లి నుంచి తాను పోటీ చేస్తున్నట్లు సుస్మిత ప్రకటించుకున్న విషయాన్ని మధుసూదనాచారి ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి కూడా తీసుకుని వెళ్లారు. 

కొండా దంపతులను తిప్పికొట్టడానికి మధుసూదనాచారి పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టి నియోజకవర్గంలో పర్యటించారు. అయినా కొండా దంపతులు వెనక్కి తగ్గలేదు. సుస్మితకు టికెట్ ఇస్తే సరి, లేదంటే పార్టీ వీడుతామని కొండా దంపతులు కేసిఆర్ కు కూడా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. సుస్మితకు టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెసులో చేరడానికి కూడా వారు సిద్ధపడినట్లు, కాంగ్రెసు పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 

loader