రసవత్తరంగా వరంగల్ తూర్పు : సురేఖ కోసం కొండా మురళీ ఎత్తులు, బీఆర్ఎస్‌కు షాక్ .. వాళ్లంతా కాంగ్రెస్‌లోకేనా
వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన తన భార్య కొండా సురేఖ కోసం .. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌తో పాటు బీఆర్ఎస్‌కు ఆయన షాకిచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటితో నామినేషన్ దాఖలుకు గడువు ముగియడంతో అభ్యర్ధులంతా ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. కొన్ని చోట్ల తమ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఇక వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన తన భార్య కొండా సురేఖ కోసం .. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌తో పాటు బీఆర్ఎస్‌కు ఆయన షాకిచ్చారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో కీలక నేతలైన డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ దంపతులతో పాటు కొందరు కార్పోరేటర్లను ఆయన కాంగ్రెస్ వైపుకు లాగారు. వీరిని రాత్రికి రాత్రే హైదరాబాద్‌కు తరలించడంతో స్థానిక బీఆర్ఎస్ నేతలకు షాక్ తగిలినట్లయ్యింది. దాదాపు 11 మంది బీఆర్ఎస్ కార్పోరేటర్లు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. సరిగ్గా 20 రోజుల్లో ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీని కొండా మురళీ చావు దెబ్బ కొట్టారని విశ్లేషకులు అంటున్నారు. ఈ కొద్దిరోజల్లో ప్రచారంపై దృష్టి పెట్టాలా.. అనుచర గణాన్ని కాపాడుకోవాలా తెలియక నన్నపనేని నరేందర్ తల పట్టుకున్నారు.
మరోవైపు.. వరంగల్ తూర్పులో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ నేత నరేందర్‌కు పార్టీ పెద్దల నుంచి అన్ని రకాలుగా అండదండలున్నాయి. ఇక సీనియర్ నేతగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కొండా సురేఖ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లోనూ అనుచరులు, అభిమానులతో పాటు అందరితోనూ వ్యక్తిగత పరిచయాలు వుండటం ఆమెకు కలిసొచ్చే అంశం. దీనికి తోడు ప్రస్తుతం కాంగ్రెస్ వేవ్ వుండటం అదనపు బలం.
అటు బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు బరిలో నిలిచారు. దాదాపు 15 ఏళ్ల పాటు వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా పనిచేసిన ఆయనకు నగరంలోని వర్తక, వ్యాపారులు, ప్రజలతో సన్నిహిత సంబంధాలున్నాయి. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన ఎర్రబెల్లి ఆ ఎన్నికల్లో ఓడిపోయారు.