తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద లీడర్ సిఎం రేస్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారా? సిఎం అభ్యర్థుల సంఖ్య లెక్కకు మించి ఉండడంతో తనకు రాదన్న ఆలోచనకు వచ్చారా? మరి సిఎం పోస్టు రాదనుకుంటే కేంద్రంలో వేరే పోస్టు కోసం ప్రయత్నం చేయబోతున్నారా? లేక ఈసారి ప్రత్యర్థి పార్టీ నుంచి గట్టి పోటీ ఉంటుందేమోనన్న ఆందోళనతో తప్పుకున్నారా? ఇంతకూ ఎవరా కీలక నేత? ఏమా కథ? తెలియాలంటే చదవండి స్టోరీ.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సిఎం అభ్యర్థులు కనీసానికి 50కి పైగానే ఉన్నారు. లెక్కబెడితే  ప్రతి జిల్లాకు ఐదారుగురు లీడర్లు సిఎం రేసులో తేల్తారు. మరి ఈ పోటీ కారణంగా నల్లగొండ జిల్లాకు చెందిన ఒక కీలక నేత తాను సిఎం రేసు నుంచి తప్పుకున్నట్లు పరోక్ష సంకేతాలిచ్చారు. ఆయనెవరంటే.. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన ఎంపిగా పోటీ చేస్తానని ప్రకటించి తాను సిఎం పదవి రేసులో లేనని స్పష్టం చేశారు.

నిజానికి అంగబలం, ఆర్థిక బలంలో కోమటిరెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పెద్ద లీడర్లలో ఒకడిగా ఉన్నారు. ఆయన, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ ఆర్థిక పరిపుష్టి ఉన్నవారే. వ్యాపారాలు దండిగా ఉన్నవారే. ఎన్నికల ఖర్చు ఎంతైనా సరే భరించేవారే. కానీ కోమటిరెడ్డి ఎందుకనో తాను పార్లమెంటుకు పోటీ చేస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఒకవేళ నల్లగొండ అసెంబ్లీ స్థానంలో ఇంతకాలం టిడిపిలో ఉన్న కోమటిరెడ్డికి బలమైన ప్రత్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లోనే కంచర్ల భూపాల్ రెడ్డి గెలుస్తాడన్న ప్రచారం సాగింది. కానీ చివరి నిమిషంలో కోమటిరెడ్డి బయట పడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కంచర్ల వ్యక్తిగత బలం, బలగానికి తోడు టిఆర్ఎస్ బలం యాడ్ అయితే అక్కడ వచ్చే ఎన్నికల్లో కంచర్ల గట్టి పోటీ ఇస్తాడన్న అనుమానం ఏమైనా కోమటిరెడ్డికి కలిగిందా అన్న చర్చ జరుగుతోంది. స్థానికంగా కంచర్ల భూపాల్ రెడ్డిని ఎదుర్కోవడం కంటే పార్లమెంటుకు పోటీ చేసి గుత్తాను ఓడించడం అల్కటి పని అని కోమటిరెడ్డి తన వ్యూహం మార్చారా అన్న వాదన వినిపిస్తోంది.

కోమటిరెడ్డి సోదరులు రాష్ట్ర విభజన నాటినుంచి తెలంగాణ పిసిసి పగ్గాలు అప్పగించాలంటూ గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ అధిష్టానం వారి అభ్యర్థనను పెడచెవిన పెట్టింది. కోమటిరెడ్డి సోదరులు వైఎస్ కు అత్యంత సన్నిహితులు కావడం.. జగన్ తో కూడా సత్సంబంధాలు కలిగి ఉండడం కారణంగా కాంగ్రెస్ అధిష్టానం వారిని పట్టించుకోలేదన్న చర్చ కూడా ఉంది. అంతేకాకుండా కోమటిరెడ్డి సోదరులు టిఆర్ఎస్ లోకి పోతారన్న ప్రచారం.. బిజెపిలోకి పోతారన్న ప్రచారాలు వచ్చిన తరుణంలో అధిష్టానం వద్ద కోమటిరెడ్డి సోదరులకు క్రేజ్ తగ్గిపోయిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి సోదరులు ప్రయత్నాలు చేసి చేసి విఫలమయ్యారు. పైగా ఉత్తమ్ తో కయ్యం కూడా పెట్టుకున్నారు. ఉత్తమ్ పై తీవ్రమైన రీతిలో విరుచుకుపడ్డారు. కానీ.. ఇప్పుడు అన్నీ సర్దుకున్నట్లే కనబడుతున్నది. ఇక రానున్న ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారంటే అన్నీ కలిసొస్తే.. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే కేంద్ర మంత్రి పదవి రేసులో ఉండొచ్చన్న ఉద్దేశంతో ఈ స్టెప్ తీసుకున్నారా అని కోమటిరెడ్డి అనుచరుల్లో చర్చ జరుగుతోంది.

ఉన్నఫలంగా సిఎం రేస్ నుంచి తప్పుకోవడం షాకింగ్ నిర్ణయంగా కోమటిరెడ్డి మద్దతుదారులు చెబుతున్నారు.