తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్ అగ్రనేత వరంగల్ సభ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో సన్నాహక సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రాజేసింది. ఈ నెల 27న రేవంత్ నల్గొండలో పర్యటించాల్సి ఉండగా.. ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మాజీ మంత్రి జానారెడ్డి జోక్యం చేసుకుని.. నాగార్జున సాగర్‌‌లో రేవంత్ రెడ్డి సన్నాహక సమావేశం ఖరారు అయ్యేలా చేశారు. దీంతో రేపు రేవంత్ రెడ్డి నాగార్జున సాగర్‌లో పర్యటించాల్సి ఉంది. 

అయితే రేవంత్ రెడ్డి పర్యటనపై తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్, ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ వీక్‌గా ఉందని.. అక్కడ జన సమీకరణ ఏర్పాటు చేయాలని అన్నారు. నల్గొండలో తాము పెద్ద పైల్వాన్‌గా ఉన్నామని.. ఇక్కడ రివ్యూ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. తాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి సమీక్ష ఏర్పాటు చేస్తామని అన్నారు. బయటి నుంచి ఎవరూ రావాల్సిన అవసరం లేదని అన్నారు.

మరోవైపు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. తాండూరులో మహేందర్ రెడ్డికి అవమానం జరిగిందన్నారు. ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ఎక్కువ అని అన్నారు. రాష్ట్రంలో డీజీపీ ఉన్నా లేనట్టేనని విమర్శించారు. పోలీసులు నిబంధనలు పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. 

ఇక, ఈ పరిస్థితుల నేపథ్యంలో రేపు రేవంత్ రెడ్డి నాగార్జున సాగర్ పర్యటన ఉంటుందా..? లేదా..? అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతుంది. రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనకు ముందుకు ఇలాంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.