Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు ప్రచారం ముగిసిన తర్వాతే తిరిగొచ్చిన వెంకట్ రెడ్డి.. కాంగ్రెస్ నేతలకు సైతం కాంటాక్ట్‌లోకి రావడం లేదా?

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లిన వెంకట్ రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగిసిన తర్వాతే తిరిగివచ్చారు. అయితే ప్రస్తుతం ఆయన టీ కాంగ్రెస్ నేతలకు అందుబాటులో లేడని సమాచారం.

Komatireddy Venkat Reddy returns hyderabad but not in touch with Congress Leaders
Author
First Published Nov 3, 2022, 10:16 AM IST

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లిన వెంకట్ రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగిసిన తర్వాతే తిరిగివచ్చారు. బీజేపీ నుంచి మునుగోడు బరిలో నిలిచిన తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయకుండా తప్పించుకునేందుకు ఆయన ఇలా చేశారనే విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. మరోవైపు రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇస్తూ వెంకట్ రెడ్డి మాట్లాడినట్టుగా ఉన్న వీడియోలు వైరల్‌ కావడంతో.. ఏఐసీసీ క్రమశిక్షణా సంఘం నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులపై ఇప్పటివరకు ఆయన బహిరంగంగా స్పందించలేదు. 

మరోవైపు ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొంటారా? లేదా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ అయి ఉండి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. సోదరుడు కోసమే వెంకట్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

అయితే హైదరాబాద్‌కు తిరిగివచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. టీ కాంగ్రెస్ నేతలకు కూడా అందుబాటులో లేడని సమాచారం. పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నుంచి తమకు స్పందన రాలేదని చెబుతున్నారు. తాను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సంప్రదించడానికి ప్రయత్నించానని.. కానీ ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. ఆయన కనీసం పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపైన స్పందించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం పూర్తిగా భిన్నమైన అంశమని అన్నారు. కానీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనాల్సి ఉందని.. ఎంపీగా ఉన్నందున కాస్త గౌరవం చూపించి ఉండాల్సిందని అన్నారు. 

అయితే రాహుల్ మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలోనే ఉండనున్నారు. మరి ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత అయినా కోమటిరెడ్డి వెంటక్ రెడ్డి.. రాహుల్ పాదయాత్రలో పాల్గొంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. తెలంగాణలో రాహుల్ యాత్ర ముగిసిన తర్వాత కోమటిరెడ్డిపై పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం నేతలు దాడిని తీవ్రతరం చేసే అవకాశలైతే కనిపిస్తున్నాయి. 

ఇదిలా ఉండే.. కొద్దిరోజుల కిందట కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిదిగా చెబుతున్న ఆడియో లీక్ అయింది. లీకైన ఆడియో టేప్ ప్రకారం.. వెంకట్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ సానుభూతిపరుడైన ఓ వ్యక్తితో మాట్లాడుతూ..  పార్టీ  చూడకుండా కోమటిరెడ్డి  రాజగోపాల్  రెడ్డికి ఓటేయాలని కోరారు. చావైనా, పెళ్లైనా రాజగోపాల్ రెడ్డి  సాయం చేస్తాడని అన్నారు. ఉపఎన్నికల తర్వాత తాను పీసీసీ చీఫ్‌గా ఎన్నికై, పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని చెప్పారు. అప్పుడు అందరిని జాగ్రత్తగా చూసుకుంటానని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.  

ఆ మరుసటి రోజే ఆస్ట్రేలియా పర్యటనలో వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్.. కాంగ్రెస్ పార్టీలో మరింత కలకలం రేపాయి. అక్కడ వెంకట్ రెడ్డి తన అభిమానులతో మాట్లాడుతూ.. మునుగోడులో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. తాను మునుగోడులో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసినా ఉపయోగం ఉండదని అన్నారు. మహా అయితే 10 వేల ఓట్లు వస్తాయని ఆయన అన్నారు. ఓడిపోయే పార్టీకి ప్రచారం చేయడమెందుకని ప్రశ్నించారు. రెండు అధికార పార్టీలు కొట్లాడుతున్నప్పుడు మనమేం చేయగలమని అన్నారు. పాదయాత్ర చేద్దామని అనుకున్నానని.. కానీ కాంగ్రెస్‌లో ఒక్కొక్కరిది ఒక్కొక్క గ్రూప్ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఫైనాన్సియల్ గా చాలా బలహీనంగా ఉందని.. తాను ప్రచారానికి వెళ్తే డబ్బులు ఎవరు పెట్టాలని ప్రశ్నించారు. 25 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని.. ఇక  చాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios