సీఎం పదవొద్దు, మంత్రి పదవొద్దు... పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారా ఇంచార్జీ మాణికం ఠాగూర్ ను కోరారు.

గురువారం నాడు హైద్రాబాద్ లో తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకం కోసం నేతల అభిప్రాయాలను మాణికం ఠాగూర్ సేకరిస్తున్నారు. ఠాగూర్ ను కలిసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అభిప్రాయాన్ని విన్పించారు. పార్టీని బలోపేతం చేయడానికి తాను చేయనున్న కార్యక్రమాలకు సంబంధించి ఓ లేఖను ఠాగూర్ కు అందించారు.

also read:రంగంలోకి ఠాగూర్: టీపీసీసీకి కొత్త చీఫ్ ఎంపికకు నేతల అభిప్రాయ సేకరణ

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో కూడా పీసీసీ చీఫ్  పదవిని అడిగాను.. కానీ ఇవ్వలేదన్నారు. ఈసారైనా తనకు  అవకాశం ఇవ్వాలని కోరినట్టుగా ఆయన చెప్పారు. 

తనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వగానే రాష్ట్రంలో పాదయాత్ర మొదలు పెడతానని ఆయన తెలిపారు. పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఊరూరా నిలదీస్తానని ఆయన స్పష్టం చేశారు.

పీసీసీ అధ్యక్షుడిగా తనను నియమిస్తే రాష్ట్రంలో పార్టీని నిలబెడతానని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని త్యాగం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తన శక్తివంచన లేకుండా కష్టపడుతానని ఆయన తెలిపారు.