భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టాయి. కోమటిరెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ బిజెపికి అస్త్రంగా మారాయి. బండి సంజయ్ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం.

తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ లో చిచ్చు పెట్టాయి. ఆయన వ్యాఖ్యలు బిజెపికి అస్త్రంగా మారాయి. తెలంగాణ బిఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయకుల మధ్య విభేదాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని నష్టపరుస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని మరింతగా బలహీనపరిచే అవకాశాలున్నాయి. 

ఆయన వ్యాఖ్యలను బిజెపి తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపట్లోనే కాంగ్రెస్ నాయకులు దానిపై స్పందించడం ప్రారంభించారు. బిఆర్ఎస్ తో పొత్తు ఉండదని, కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కాంగ్రెస్ నాయకులు చెప్పే ప్రయత్నాలు ప్రారంభించారు. అయినప్పటికీ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లే అవకాశఆలున్నాయి.

బిఆర్ఎస్, కాంగ్రెస్ కలుస్తాయని తాము ముందే చెప్పామని బిజెపి నాయకులు అంటున్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బిఆర్ఎస్ తో కలవడం ఖాయమని బండి సంజయ్ అన్నారు. గతంలో కాంగ్రెస్ శాసనసభ్యులు బిఆర్ఎస్ (అప్పటి టిఆర్ఎస్)లో చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచేవారు బిఆర్ఎస్ లోకి వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు. ఇప్పటికే ప్రజల్లో కాంగ్రెస్ మీద అనుమానాలు ఉన్నాయి. వారిని గెలిపిస్తే బిఆర్ఎస్ లోకి వెళ్లరనే గ్యారంటీ ఏమీ లేదని ప్రజలు అనుకుంటున్నారు. దానివల్ల బిఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కు పడే అవకాశాలు సన్నగిల్లుతాయి. 

దాని వల్ల బిజెపి బలం పుంజుకునే అవకాశం ఉంది. కెసిఆర్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కాకుండా బిజెపికి పడే అవకాశాలుంటాయి. దానివల్ల కాంగ్రెస్ నష్టపోవడమే కాకుండా బిజెపి పుంజుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో పలువురు సీనియర్ నేతలు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. ఇందులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డికి ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం కట్టడి చేయలేకపోతోంది. దాన్ని ఆసరా చేసుకుని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమయం చిక్కినప్పుడల్లా కాంగ్రెస్ ను నష్టపరిచే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరారు. బిజెపి అభ్యర్థిగా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బిజెపిలో చేరుతారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. కానీ ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతూ అసమ్మతి గళం వినిస్తూ వస్తున్నారు.