తన రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తిని అధికార పార్టీ వారే పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్లగొండ మున్సిపల్ ఛైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ ను కొందరు దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ హత్య వెనుక నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్లగొండ డిఎస్పీ సుధాకర్ పాత్ర ఉందని కోమటిరెడ్డి ఆరోపించారు. హత్య ఘటన తెలిసిన వెంటనే హుటాహుటిన కోమటిరెడ్డి హైదరాబాద్ నుంచి నల్లగొండ బయలుదేరి వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యలను గుండెలకు హత్కుకుని బోరున విలపించారు. కన్నీరుమున్నీరుగా ఏడ్చారు కోమటిరెడ్డి.

హత్యను నిరసిస్తూ హంతకులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలోని క్లాక్ టవర్ వద్ద ఆందోళనకు దిగారు కోమటిరెడ్డి. నల్లగొండ పట్టణ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారనందుకే బొడ్డుపల్లి శ్రీనివాస్ ను మర్డర్ చేశారని ఆరోపించారు. ఈ హత్యలో దుర్మార్గుడైన డిఎస్పీ సుధాకర్ పాత్ర కూడా ఉందన్నారు. గతంలోనే ఎమ్మెల్సీగా పోటీ చేసిన సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ ను, తనను హతమారుస్తామని బెదిరించారని చెప్పారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ కు, మున్సిపల్ చైర్ పర్సన్ కు ప్రాణహాని ఉందని, వారికి గన్ మెన్ ను ఇవ్వాలని సిఎం వద్దకు భార్యాభర్తలిద్దరినీ తీసుకుపోయి విన్నవించినా సిఎం స్పందించలేదన్నారు.

గత పదిహేను రోజుల కింద నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నార్కట్ పల్లి సమీపంలోని వివేరా హోటల్ కు పిలిపించి బెదిరించారని ఆరోపించారు. పార్టీ మారకపోతే తీవ్ర పరిణామాలుంటాయని అని హెచ్చరించినట్లు చెప్పారు. ఇంతలోనే ఇంతటి దారుణానికి ఒడిగట్టారని విమర్శించారు. శ్రీనివాస్  కు ప్రతిరోజు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవని.. తానే స్వయంగా ఒకసారి ఫోన్ ను అటెంప్ట్ చేశానని చెప్పారు. పార్టీ మారకపోతే చంపుతారా? ఇదెక్కడి రాజకీయం అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

శ్రీనివాస్ హత్య, బాధిత కుటుంబసభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి వీడియో కింద ఉంది.