నల్లగొండ కోమటిరెడ్డి సంచలన ప్రకటన

నల్లగొండ కోమటిరెడ్డి సంచలన ప్రకటన

సంచలనాలకు కేంద్ర బిందువైన నల్లగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. తాను రానున్న ఎన్నికల్లో నల్లగొండ ఎంపి స్థానానికి పోటీ చేస్తానని కొద్దిసేపటి క్రితం నల్లగొండలో మీడియాతో ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో తెలంగాణ కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే తెలంగాణ కోసమే చేసినప్పటికీ.. అప్పటి సిఎం కిరణ్ కుమార్ రెడ్డితో పొసగక రాజీనామా చేశారన్న ప్రచారం ఉంది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పలు సందర్భాల్లో అనేకసార్లు వివాదాస్పద ప్రకటనలు చేశారు కోమటిరెడ్డి.

కొన్నిసార్లు టిఆర్ఎస్ ను ఆకాశానికెత్తుతూ మాట్లాడిన దాఖలాలున్నాయి. అయితే కొన్నిసార్లు మాత్రం టిఆర్ఎస్ పై తీవ్రమైన స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గతంలో ఆయన టిఆర్ఎస్ లో చేరతారన్న ప్రచారం సాగింది. మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ బిజెపి వైపు పోతారన్న ఊహాగానాలు వచ్చాయి.

ఇంకొన్ని సందర్భాల్లో అయితే.. కోమటిరెడ్డి సోదరులు సొంత పార్టీ పెడతారన్న ప్రచారం కూడా బలంగా సాగింది. కాంగ్రెస్ పార్టీలో పిసిసి రేసులో ఉన్నామని ప్రకటించారు. పిసిసి పదవి రాకపోయినా.. పార్టీలో పనిచేస్తామని ఒకసారి ప్రకటించారు. ఉత్తమ్ పిసిసి అధ్యక్షుడి పదవికి అనర్హుడు అని ఒకసారి విమర్శించారు.

అయితే తన నియోజకవర్గంలోని మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి టిఆర్ఎస్ మీద అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. టిఆర్ఎస్ తో తాడో పేడో తేల్చుకుంటానని ఆయన తీవ్రమైన భాషలో విరుచుకుపడుతున్నారు. తాజాగా నల్లగొండ అసెంబ్లీకి కాకుండా పార్లమెంటుకు పోటీ చేస్తానని ప్రకటించిన సంచలనం రేకెత్తించారు. ఈ వార్త ఇప్పుడు నల్లగొండ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

 ప్రభుత్వం రైతులను భిక్షగాళ్లలా చూస్తోందని కోమటిరెడ్డి విమర్శించారు. కాలుష్యం వెదజల్లే థర్మల్ ప్లాంట్‌ను దామరచర్లలో ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఒకేసారి రుణమాఫీ చేస్తామని ఈ సందర్భంగా కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page