సీఎం అవడం గ్యారెంటీ అంటున్న కోమటి రెడ్డి

తెలంగాణలో ఎన్నికలు రావడానికి ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇంత వరకు జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ గులాబీ పార్టీనే జయకేతనం ఎగరవేసింది.

మరోవైపు తెలంగాణ ఇచ్చినా ఆ క్రెడిట్ దక్కలేదని తమ పార్టీ కష్ట కాలంలో ఉందని స్వయంగా కాంగ్రెస్ నేతలే చెప్పుకొస్తున్నారు.

ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల తన పార్టీ నేతలే టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు.

దీంతో టీ పీసీసీ నేతలు ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ విషయాన్ని కూడా కోమటి రెడ్డి లైట్ గానే తీసుకుంటున్నారు.

సర్వేలో పేరుతో జనాల్ని మోసం చేయడం, పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడటంపై మాత్రమే తాను అభ్యంతరం వ్యక్తం చేశానని కోమటి రెడ్డి వివరణ ఇచ్చారు. పనిలో పనిగా తన మనసులోని మాటను కూడా బయటపెట్టారు.

తెలంగాణకు తాను ముఖ్యమంత్రి అయ్యేది ఖాయమని, కానీ అది ఎప్పుడో మాత్రం చెప్పలేనని జోస్యం చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 90 సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.