మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని పెంచిన విష‌యం తెలిసిందే. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆయ‌న మాట్లాడిన దానిపై వ్య‌తిరేక‌త మొద‌ల‌వుతోంది. 

రాజ‌గోపాల్ రెడ్డి గ‌త కొన్ని రోజులుగా ముఖ్య‌మంత్రిని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై పార్టీ చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించిన‌ట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్వయంగా రంగంలోకి దిగారు. ఈ విష‌య‌మై గురువారం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి వివరణ కోరనున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మేలు కలగాల్సిన తరుణంలో, ప‌దే ప‌దే సీఎం రేవంత్‌ను లక్ష్యంగా చేసుకోవడం వల్ల ప్రతికూల ప్రభావం పడుతోందని కమిటీ భావిస్తోంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా వ్యాఖ్యలు చేయడంపై సీరియస్‌గా ఆలోచన జరుపుతున్నట్లు స‌మాచారం.

అస‌లేం జ‌రిగిందంటే.?

ఇటీవ‌ల మీడియా స‌మావేశంలో పాల్గొన్న రాజ‌గోపాల్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాట్లాడుతూ.. "ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేది. కానీ, నన్ను నమ్మిన మునుగోడు ప్రజల కోసమే అక్కడి నుంచే పోటీ చేశాను,పదవుల కోసం పరుగెత్తే వాడిని కాదు. నన్ను ఎంపిక చేస్తే అది నా కోసం కాదు.. ప్రజల కోసం మాత్రమే” చెప్పుకొచ్చారు.

ఆయ‌న ఇంకా మాట్లాడుతూ.. త‌న‌కు మంత్రి ప‌దవి ఇస్తామ‌ని ఎప్పుడో మాటిచ్చారు. దానికోసం పైరవీ చేయడం ఇష్టం లేదని కోమటిరెడ్డి తెలిపారు. “ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లకు, నా కంటే చిన్నవాళ్లకు పదవులు ఇచ్చారు. కానీ నేను దానికోసం దిగజారాల్సిన అవసరం లేదు. ఎవరి కాళ్లు మొక్కాల్సిన ప‌నిలేదు. పదవి ఇస్తారా ఇవ్వరా అన్నది అధిష్ఠానం చూసుకుంటుంది” తేల్చి చెప్పారు.

అంత‌టితో ఆగ‌ని రాజ‌గోపాల్ రెడ్డి.. తాను కాంగ్రెస్‌లో కొనసాగుతున్నప్పటికీ, అవసరమైతే మళ్లీ త్యాగానికి కూడా సిద్ధమన్నారు. “పదవులు లేకున్నా మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తా. వారి విశ్వాసాన్ని దెబ్బతీసే పని ఏనాడూ చేయను. ప్రజలు తలదించుకునేలా నేను ప్రవర్తించను” అని వెల్లడించారు. ఈ మాటలు పార్టీ అంతర్గతంగా పెద్ద చర్చకు దారితీశాయి.