కోమటిరెడ్డి సోదరులకు నల్లగొండ జిల్లాలో ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇప్పటి వరకు సోదరులిద్దరూ ఎంపిగా ఒకరు, ఎమ్మెల్యేగా ఒకరు పోటీ చేశారు. కానీ 2019 ఎన్నికల్లో ఇద్దరూ అసెంబ్లీ కే పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. దీంతో నల్లగొండ స్థానం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఉండగా రాజగోపాల్ రెడ్డికి సీటు వేటలో ఉన్నారు. అయితే ఇద్దరు సోదరులూ ఇప్పుడు తమ చిరకాల ప్రత్యర్థిగా ఉన్న పాల్వాయి గోవర్దన్ రెడ్డి కుమార్తె సీటుపై కన్నేశారు. ఎలాగైనా మునుగోడులో పాగా వేయాలని ప్రయత్నిస్తున్నారు.

మునుగోడు నియోజకవర్గంలో దివంగత పాల్వాయి గోవర్దన్ రెడ్డికి భారీ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఏండ్ల తరబడి మునుగోడును శాసించారు. ప్రస్తుతం ఆ స్థానంలో పాల్వాయి రాజకీయ వారసత్వం కోసం సొంత కుమార్తె పాల్వాయి స్రవంతిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆమె నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో స్రవంతిరెడ్డికి పొగ పెట్టి ఎలాగైనా మునుగోడులో పాగా వేయాలని కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తూ రాజకీయ వేడిని రగలిస్తున్నారు.

తాజాగా ఎఐసిసి అధినేతగా పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీకి అభినందన సభ అంటూ చండూరులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సభ ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సభకు పెద్దగా జనాలు రాలేదు. సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కుర్చీలు, డిజె లాంటివి ఏర్పాటు చేసినా.. జనాలు రాకపోవడంతో సభ వెలవెలబోయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడే సమయంలో జనాలు లేరు. దీంతో ఖాళీ కుర్చీలకే ప్రసంగం వినిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోమటిరెడ్డి రాజగోపాల్ ప్రసంగం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే చక్కర్లు కొడుతున్నది.

రాజగోపాల్ రెడ్డి స్రవంతిరెడ్డిపై గట్టిగానే చరకలు వేస్తున్నారు. తాను మునుగోడులో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలవడం కాయమని సవాల్ విసిరారు. స్రవంతిరెడ్డి తనకు సహకరిస్తే ఆమెకు ఎమ్మెల్సీ సీటు ఇప్పిస్తానని కూడా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో అధిష్టానం నుంచి సంకేతాలు ఉండబట్టే కోమటిరెడ్డి రాజగోపాల్ మునుగోడులో హల్ చల్ చేస్తున్నారా? లేక ఎంపిగా పోటీ చేయడం ఇష్టం లేక మునుగోడు నియోజకవర్గాన్ని ఎంచుకుని హడావిడి చేస్తున్నారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

కోమటిరెడ్డి సోదరుల పుట్టిన ఊరు నకిరేకల్ నియోజకవర్గంలో ఉంటుంది. నకిరేకల్ లో వారు పోటీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే అది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయింది. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకరు నల్లగొండ, ఇంకొకరు మునుగోడులో వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ స్రవంతిరెడ్డికే ఇస్తే కోమటిరెడ్డి ఏం చేస్తారన్నది కూడా చర్చనీయాంశమైంది. ఇండిపెండెంట్ గా మునుగోడులో కంటెస్ట్ చేస్తారా? అన్నది తేలాలి. మరోవైపు కోమటిరెడ్డికే కాంగ్రెస్ టికెట్ వస్తే స్రవంతిరెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలున్నాయా? లేదంటే ఇద్దరి పొత్తుల ఈ సీటును గతంలో మాదిరిగా పొత్తులో భాగంగా మరోసారి సిపిఐకి కాంగ్రెస్ అధిష్టానం కట్టబెట్టే అవకాశాలున్నాయా అన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.