కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారంపై సంకేతాలిచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ప్రజల కోసం అన్నయ్య, తానూ ఒకేరకంగా ఆలోచిస్తామని చెప్పారు. నా ఆలోచన, మా అన్నయ్య ఆలోచన ఒకటేనని రాజగోపాల్ రెడ్డి అన్నారు.  

ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలుగా వున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (komatireddy rajagopal reddy) హస్తం పార్టీకి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkatreddy) కాంగ్రెస్‌లోనే (congress) కొనసాగుతారా లేక ఆయన కూడా బీజేపీలో (bjp) చేరుతారాన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీవీకి గురువారం ఇంటర్వ్యూ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజల కోసం అన్నయ్య, తానూ ఒకేరకంగా ఆలోచిస్తామని చెప్పారు. నా ఆలోచన, మా అన్నయ్య ఆలోచన ఒకటేనని రాజగోపాల్ రెడ్డి అన్నారు. వెంకట్ రెడ్డి పార్టీ మార్పుపై పరోక్షంగా హింట్ ఇచ్చారాయన. 

అంతకుముందు ఆయన ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మునుగోడులో ఉపఎన్నిక వస్తేనే అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ తీర్పు ద్వారా తెలంగాణ రాజకీయాలు మారిపోతాయని ఆయన పేర్కొన్నారు. తాను బాధతోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేశానని.. సోనియా, రాహుల్ గాంధీ అంటే ఇప్పటికీ గౌరవం వుందన్నారు. మునుగోడు ప్రజలపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని.. మా దగ్గర అవినీతి సొమ్ము లేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. 

Also Read:కన్నీళ్లు, కష్టాలు దిగమింగాను... జైలుకెళ్లొచ్చిన వ్యక్తి కింద పనిచేయలేను: సోనియాకి రాజగోపాల్ రెడ్డి లేఖ

ఉద్యమ నేపథ్యంలో వున్న వ్యక్తిని ముందు పెట్టాలని అధిష్టానాన్ని కోరామని ఆయన చెప్పారు. 2014 ఎన్నికల్లో టికెట్ల పంపిణీ సరిగా లేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. నాయకత్వాన్ని లీడ్ చేసే వ్యక్తికి క్రెడబులిటి, కెపాసిటీ వుండాలని ఆయన అభిప్రాయపడ్డారు. కుంతియా గురించి వ్యతిరేకంగా ఎన్నోసార్లు మాట్లాడానని.. 12 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా నాయకత్వాన్ని మార్చలేదని రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీలో తనకు ఎలాంటి పదవీ లేదని.. టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తికి నాయకత్వం ఇస్తే ఆత్మగౌరవం చంపుకుని వుండాలని అని ఆయన ప్రశ్నించారు. పార్టీలో ఆత్మగౌరవం లేకుండా ఎలా కొనసాగుతామని కోమటిరెడ్డి నిలదీశారు. 

ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలను ప్రభుత్వం పట్టించుకోదని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపఎన్నికలు వస్తేనే నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమిత్ షాను కలిసిన వెంటనే తన నియోజకవర్గంలో కొత్త మండలాన్ని ప్రకటించారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక చరిత్రలో నిలిచిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. మునుగోడు సమస్యలపై ఎన్నోసార్లు మాట్లాడానని.. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానని, ఐనా సమస్యలు పరిష్కారం కాలేదని రాజగోపాల్ రెడ్డి దుయ్యబట్టారు.