Asianet News TeluguAsianet News Telugu

కన్నీళ్లు, కష్టాలు దిగమింగాను... జైలుకెళ్లొచ్చిన వ్యక్తి కింద పనిచేయలేను: సోనియాకి రాజగోపాల్ రెడ్డి లేఖ

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం లేఖ రాశారు. జైలుపాలైన వ్యక్తి ఆధ్వర్యంలో తాను కలిసి పనిచేయలేనని.. మీపైనే వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించారని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. 
 

komatireddy rajagopal reddy letter to congress chief sonia gandhi
Author
hyderabad, First Published Aug 4, 2022, 4:10 PM IST

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం లేఖ రాశారు. కాంగ్రెస్ ద్వారా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మరో రాజకీయ పోరాటం చేయాలని లేఖలో కోమటిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని కొందరు నిర్వీర్యం చేశారని.. ఎమ్మెల్యేలను గెలిపించలేని వ్యక్తులు, గెలిచిన ఎమ్మెల్యేల్లో మనోధైర్యం నింపలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. జైలుపాలైన వ్యక్తి ఆధ్వర్యంలో తాను కలిసి పనిచేయలేనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అనేక పార్టీలు మారి స్వలాభం కోసం ఓ ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేశారని ఆయన ఆరోపించారు. 

మీపైనే వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించారని... ఇది తనను తీవ్రంగా బాధించిందని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి విధేయులైన వారిని అడుగడుగునా అవమానపరుస్తున్నారని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. మీ నాయకత్వంలో ఏ పని అప్పగించినా రాజీ లేకుండా కష్టపడ్డానని రాజగోపాల్ రెడ్డి గుర్తుచేశారు. కన్నీళ్లు, కష్టాలు దిగమింగుకుంటూ పార్టీలో పనిచేశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అరవై ఏళ్ల కలను సాకారం చేసుకునేందుకు అనేక వందల మంది ఆత్మబలిదానాలు చేశారని.. కానీ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయ్యిందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని .. దీనిని తక్షణం ఆమోదించాలని రాజగోపాల్ రెడ్డి కోరారు. 

కాగా... మునుగోడు ఎమ్మెల్యే పదవికి , కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని త్వరలోనే కలిసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా పత్రాన్ని కూడా అందిస్తానని కూడా రాజగోపాల్ రెడ్డి మంగళవారం నాడు ప్రకటించారు. కొన్ని రోజులుగా నియోజకవర్గంలో  ముఖ్య నేతలతో రాజగోపాల్ రెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు హైద్రాబాద్ లో రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో కూడా కొందరు నేతలు ఆయనతో పాటే సమావేశంలో పాల్గొన్నారు. 

మరోవైపు.. మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగితే తమ పట్టును నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.ఈ తరుణంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైపునకు పార్టీ కార్యకర్తలు వెళ్లకుండా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనుంది. ఆయా మండలాల్లో పర్యటిస్తూ నేతల అభిప్రాయాలను సేకరించనున్నారు. 

 

komatireddy rajagopal reddy letter to congress chief sonia gandhi

Follow Us:
Download App:
  • android
  • ios