హైదరాబాద్: తాను బిజెపి నేత డికె అరుణను కలిసినట్లు వచ్చిన వార్తలపై కాంగ్రెసు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఆ వార్తలపై ఆయన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరినీ కలువలేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు రాజకీయాలు చేసే సమయం కాదని ఆయన అన్నారు. కరోనాతో ప్రజలు ఇప్బందులు పడుతుంటే రాజకీయాలు ఏమిటని ఆయన అడిగారు.

బిజెపి నేత డికె అరుణ కాంగ్రెసు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సమావేశమైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇరువురి మధ్య దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘమైన చర్యలు జరిగాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆమె పార్టీలోకి ఆహ్వానించారు త్వరలో తన నిర్ణయాన్ని తెలియజేస్తానని రాజగోపాల్ రెడ్డి డికె అరుణకు చెప్పినట్లు తెలుస్తోంది. 

మూడు రోజుల క్రితం డికె అరుణ కొండా విశ్వేశ్వర రెడ్డితో భేటీ ఆయ్యారు. ఆయనను బిజెపిలోకి ఆహ్వానించారు. ఆయన సానుకూలంగా ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. కొండా విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 

కాగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్ త్వరలో బిజెపిలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 11వ తేదీ తర్వాత ఆయన బిజెపిలో చేరవచ్చునని అంటున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ బిజెపిలో చేరుతారని అంటున్నారు.

మాజీ మంత్రి డికె ఆరుణ కాంగ్రెసు నుంచే బిజెపిలోకి వచ్చారు. తన పరిచయాలను వాడుకుంటూ కాంగ్రెసు నేతలను బిజెపిలోకి తేవడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నట్లు అర్థమవుతోంది.