హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం డబ్బులు తనకు వచ్చాయని చెబుతూ ఆ డబ్బులు తనకు అవసరమా అని కాంగ్రెసు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. తనలాంటి వాళ్లకు రైతు బంధు డబ్పులు అవసరమా అని ఆయన అడిగారు. 

వివిధ శాఖల కింద మంత్రులు ప్రవేశపెట్టన పద్దులపై తెలంగాణ శాసనసభలో చర్చ సందర్బంగా ఆయన ఆ విధంగా ప్రశ్నించారు. రైతుబంధు పథకం మంచి కార్యక్రమమేని ఆయన అన్నారు. రైతులకు ఏ విధమైన సహాయం చేసినా మంచిదేనని ఆయన అన్నారు. రైతుబంధు ప్రయోజనాలు నిజమైన పేద రైతులకే అందాలి తప్ప సంపన్నులకు కాదని ఆయన అన్నారు. 

అన్నం పెట్టే రైతులకు రైతుబంధు పథకం మంచిదనని, మనలో చాలా మందిమి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినవాళ్లమేనని, ప్రభుత్వం  చేసే సహాయం నిజంగా వ్యవసాయం చేసేవాళ్లకు, పేద రైతులకు అందాలని ఆయన అన్నారు. 

రైతుబంధు పథకం నిధులు రూ.3 లక్షలు తన ఖాతాలో జమయ్యాయని ఆయన చెప్పారు. తనలాంటివాళ్లకు ఇవ్వడం అవసరమా అని అడిగారు. ప్రభుత్వ నిధులు పేద రైతులకు దక్కాలని ఆయన అన్నారు. రైతులకు గిట్టుబాట ధర వచ్చేలా చూడాలని, అలా చేస్తే వ్యవసాయం లాభదాయకమవుతుందని ఆయన చెప్పారు.