ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్లు కాంగ్రెస్‌లో వున్న తాము.. బయటి నుంచి వచ్చిన వ్యక్తిని సీఎంను చేయాలా అంటూ ప్రశ్నించారు. 

ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తుల కింద 20 ఏళ్లు కాంగ్రెస్‌లో వున్న తాము పనిచేయాలా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలోనే తనకు అవమానం జరిగిందని కోమటిరెడ్డి తెలిపారు. 20 ఏళ్లు సోనియాను తిట్టిన వ్యక్తిని పీసీపీగా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కింద మమ్మల్ని పనిచేయమంటున్నారని... ఇంతకన్నా అవమానం వుందా అంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.
జాతీయ నాయకత్వం బలహీనపడటం వల్ల కాంగ్రెస్‌లో వుండి కూడా ఏమీ చేయలేకపోయానని ఆయన అన్నారు. 

తన జిల్లాలోనే అవకాశవాద రాజకీయాలు చేసేవారు వున్నారని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్ట్‌ల కోసం తాను రాజీనామా చేస్తున్నానని కొందరు ప్రచారం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామా ద్వారా ప్రజలకు కొంత మేలు జరగొచ్చు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మునుగోడులో ఎవరు గెలవాలన్నది ప్రజలు నిర్ణయిస్తారని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తన వ్యాపారానికి, రాజకీయ జీవితానికి సంబంధం లేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాజకీయ నాయకుడిగా తన పలుకుబడిని వ్యాపారానికి ఉపయోగించుకోలేదని కోమటిరెడ్డి తేల్చిచెప్పారు. తన పోరాటం కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ భవిష్యత్ కోసమేనని ఆయన అన్నారు. 

ALso REad:ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. కాంగ్రెస్‌కీ గుడ్‌బై

నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం దూసుకుపోతోందని... టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ సరిగా పోరాటం చేయలేదు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. అధిష్టానం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాంగ్రెస్ బలహీనపడిందని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నా మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటుందన్న ఆయన .. తాను ఏం తప్పు చేశానని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కమిటీలు వేసేటప్పుడు కూడా కనీసం మాట్లాడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

తన రాజీనామాను స్పీకర్ త్వరగా ఆమోదించాలని.. కాంగ్రెస్ గుర్తు మీద గెలిచి, ఎమ్మెల్యేగా కొనసాగడం నైతికం కాదన్నారు. రేపో , ఎల్లుండో స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి బాధతో రాజీనామా చేశానని.. బయటి నుంచి వచ్చిన వ్యక్తిని సీఎంని చేయాలా అంటూ కోమటిరెడ్డి ప్రశ్నించారు. తాను తప్పు చేశానంటే ఏ చర్చకైనా సిద్ధమేనని ఆయన సవాల్ విసిరారు. తన పదవీ త్యాగంతోనైనా కేసీఆర్ కళ్లు తెరవాలని కోమటిరెడ్డి చురకలు వేశారు. డబ్బుల కోసం పదవుల కోసం అమ్ముడుపోయే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు.