కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం మీడియా ముందు ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు.  

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామాపై తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోందన్నారు . తానంటే గిట్టనివారు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్‌, టీవీ ఇంటర్వ్యూలలో తప్పుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామాపైనా చర్చ పక్కదారి పట్టిందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా పోడు భూముల సమస్య వుందని.. అసెంబ్లీ సాక్షిగా ఈ విషయంపై ఎంతోమంది మాట్లాడారని ఆయన గుర్తుచేశారు. 

అటవీ శాఖ అధికారులు పోడు భూముల్లో ఫెన్సింగ్ వేసి గిరిజనులను వ్యవసాయం చేసుకోనివ్వడం లేదని రాజగోపాల్ రెడ్డి ఫైరయ్యారు. గడిచిన మూడేళ్లుగా తన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన అన్నారు. పెన్షన్, రేషన్ కార్డులు, లక్ష రుణమాఫీ, ఇళ్ల నిర్మాణం , నిరుద్యోగ భృతి ఇలా ఏ ఒక్క విషయంలోనూ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడం లేదని రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రతిపక్షనేతలను గౌరవించాలనే ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్‌కు.. భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా వుంటే ఒర్వలేకపోయారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు.