తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి పప్పులో కాలేసిండు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కోమటిరెడ్డి ఇట్లెట్ల చేసిండబ్బా అని అసెంబ్లీ వర్గాలు ముక్కు మీద వేలేసుకుంటున్నాయి. తెలంగాణ సిఎం కేసిఆర్ మీద పోరాడుతున్న కోమటిరెడ్డి చేసిన చిన్న పొరపాటు ఆయననే కాకుండా కాంగ్రెస్ ను కూడా ఇరకాటంలోకి నెట్టేసింది. ఇంతకూ అసలు ముచ్చటేందబ్బా అనుకుంటున్నారా? అయితే చదవండి స్టోరీ.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 12న ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నర్సింహ్మన్ ప్రసంగించారు. ఆ ప్రసంగం సమయంలో నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గవర్నర్ కు సూటి చూసి హెడ్ ఫోన్స్ విసిరికొట్టిండు. కానీ అవి గవర్నర్ కు తగలలేదని, అవి గవర్నర్ పక్కనున్న శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కు తగిలాయని సర్కారు వాదన. సర్కారు వాదనపై భిన్న స్వరాలున్నాయి. అలా తగిలితే ఆ వీడియోలు బయట పెట్టాలని కాంగ్రెస్ పట్టుబడుతున్నది. కానీ సర్కారు మాత్రం ఆ వీడియోల వెల్లడి విషయంలో ఇరకాటంలో పడింది. సర్కారు ఇరకాటంలో ఉన్న తరుణంలో దెబ్బ మీద దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది.

అందులో భాగంగానే ఈనెల 12న జరిగిన అసెంబ్లీ వీడియో పుటేజీ కావాలంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనసభ కార్యదర్శికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ దరఖాస్తు కాంగ్రెస్ కొంప ముంచేలా కనబడుతున్నది. ఎందుకంటే కోమటిరెడ్డి అడగాల్సింది వదిలేసి వేరేది అడిగారు. అసలే సందు దొరికితే కత్తి దూసేందుకు రెడీగా ఉన్న కేసిఆర్ సర్కారుకు కోమటిరెడ్డే స్వయంగా ఆయుధం ఇచ్చేశారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన దరఖాస్తు ఫారం ఒకసారి చదివితే మరీ ఇలాంటి అప్లికేషన్ ఇచ్చిర్రేందబ్బా అన్న అనుమానాలు కలగక మానవు. ఎందుకంటే.. ఆయన దరఖాస్తులోని మొదటి పేరాలోనే.. సమాచార హక్కు చట్టం కింద ఈనెల 12న జరిగిన అసెంబ్లీ సమావేశం తాలూకు అసెంబ్లీలోని అన్ని సిసి కెమెరాల వీడియో పుటేజీ ఇవ్వాలంటూ విన్నవించారు. ఈ ఒక్క మిస్టెక్ చాలు కేసిఆర్ సర్కారు ఊపిరి పీల్చుకోవడానికి. ఎందుకంటే? అసెంబ్లీలోని సభా మందిరం (హౌస్) లోపల ఎక్కడా సిసి కెమెరాలు ఉండవు. అలాగే సభా మందిరం నుంచి బయట ఉన్న ప్రదేశాన్ని ఇన్నర్ లాబీలు అంటారు అక్కడ కూడా సిసి కెమెరాలు ఉండవు. ఎందుకంటే..? అక్కడ సభ్యుల ప్రివిలేజ్ విషయం కాబట్టి అక్కడ జరిగే వాటిని రికార్డు చేయరాదన్న ఉద్దేశంతోనే సభా మందిరం, ఇన్నర్ లాబీల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయలేదు. అందుకే సభామందిరంతోపాటు ఇన్నర్ లాబీల్లోకి సభ్యులు తప్ప వేరేవాళ్లకు ఎంట్రీ ఉండదు.

ఇక సభా మందిరంలో కేవలం ఐదు లైవ్ కవరేజీ కోసం మాత్రమే పెద్ద కెమెరాలు అమర్చబడి ఉంటాయి. స్పీకర్ ఛైర్ కు ఇటువైపు ఒకటి, అటువైపు ఒకటి బిగించబడి ఉంటాయి. మూడోది స్పీకర్ ఛైర్ కు ఎదురుగా పైన మీడియా గ్యాలరీలో ఒకటి ఉంటుంది. పైననే మరో రెండు కెమెరాలు ఉంటాయి. ఈ కెమెరాల ద్వారా అసెంబ్లీ సమావేశాలను ఎప్పటి కప్పుడు లైవ్ కవరేజీ ఇస్తుంటారు. మరి కోమటిరెడ్డి లైవ్ కవరేజీ తాలూకు రా పుటేజీ అడగాల్సిందిపోయి సిసి కెమెరాల పుటేజీ అడిగారు. దీంతో ఆయనే సర్కారును సేఫ్ జోన్ లోకి నెట్టేశారు. అయితే కోమటిరెడ్డి అడిగిన లెక్క ప్రకారం స్పీకర్ చాంబర్ ముందు, సిఎం చాంబర్, ప్రతిపక్ష నేత చాంబర్ల ముందు బయట ఉన్న సిసి కెమెరాల పుటేజీని అసెంబ్లీ సెక్రటరీ కోమటిరెడ్డికి అందించే అవకాశం ఉంటదని అసెంబ్లీలో వర్గాల్లో టాక్ నడుస్తోంది..

మరోవైపు 48 గంటల్లో సమాచారం ఇవ్వాలని, లేకపోతే బాధ్యులైన వారి వివరాలు, కూడా ఇవ్వాలని కోమటిరెడ్డి తాను రాసిన దరఖాస్తులో కోరడం కూడా వివాదాస్పదమవుతోంది. ఆర్టీఐ కింద అలా బెదిరింపులతో కూడిన దరఖాస్తు చేయడం ఏంటని అసెంబ్లీ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. 

మొత్తానికి కోమటిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ చేసిన చిన్న పొరపాటు కేసిఆర్ సర్కారును రిలాక్స్ మూడ్ లోకి తీసుకెళ్లాయని అసెంబ్లీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.