రూట్ మార్చిన కోమటిరెడ్డి బ్రదర్స్

First Published 5, Apr 2018, 8:04 PM IST
komatireddy borthers ready to contest mp seats
Highlights
ఎందుకో తెలుసా?

నల్లగొండ రాజకీయాల్లో సుపరిచితులైనవారు కోమటిరెడ్డి సోదరులు. జిల్లాలో బలం, బలగం ఉన్న లీడర్లలో టాప్ వరుసలో ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలోనైనా తెలంగాణలోనైనా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వారు హవా చెలాయిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎదురుదెబ్బలతో కొంత ఇబ్బందులకు గురయ్యారు కోమటిరెడ్డి సోదరులు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి కుడి భుజం లాంటి అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కోమటిరెడ్డిని కలవరపాటుకు గురిచేసింది. బొడ్డుపల్లి హత్య జరిగిన కొద్ది రోజులకే కోమటిరెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దు చేశారు. ఈ పరిణామాలతో కోమటిరెడ్డి సోదరులు రూట్ మారుస్తున్నారని ప్రచారం నడుస్తోంది. మరి వారి గమ్యం ఏమిటి? ఎందుకు రూట్ మారుస్తున్నారో చదవండి.

రానున్న ఎన్నికల్లో కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ ఎంపి స్థానాల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. నల్లగొండ పార్లమెంటుకు తాను పోటీ చేస్తానంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా ముందు కూడా ప్రకటించారు. నల్లగొండలో తన స్థానంలో ఒక యువకుడిని పోటీకి దింపుతానని ప్రకటించారు కూడా. అయితే నల్లగొండ స్థానంలో దివంగత బొడ్డుపల్లి శ్రీనివాస్ సతీమణి, మున్సిపల్ ఛైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నాయి. ఈ విషయంలో కోమటిరెడ్డి క్లారిటీ కూడా ఇచ్చారు. లక్ష్మి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా పనిచేస్తారని ప్రకటించారు.

ఇక కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే ఆయన మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం సాగింది. ఆయన కూడా కొంత ఎఫర్ట్ పెట్టారు. కానీ అక్కడ బలమైన నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఉండడంతో రాజగోపాల్ రెడ్డి తన ప్రయత్నాలు విరమించుకున్నట్లు చెబుతున్నారు. అయితే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి కొడుకు ను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఇక రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే స్థానంలో కాకుండా మళ్లీ భువనగిరి పార్లమెంటులోనే పోటీ చేసి సత్తా చాటాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇక నల్లగొండలో యువకుడు అంటే కోమటిరెడ్డి కుటుంబం నుచే మరో వారసుడిని బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. కోమటిరెడ్డి సోదరుడి కొడుకును నల్లగొండలో, రాజగోపాల్ రెడ్డి కుమారుడిని మునుగోడులో రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇద్దరు సోదరులు ఎంపి సీట్లకు పోటీ చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. తమ ఆలోచనను అధిష్టానం చెవిలో వేసినట్లు చెబుతున్నారు.

మరి ఈ ఆలోచనలు ఇలాగే ఉంటాయా ? లేక మార్పలు చేర్పులు ఉంటాయా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

loader