అవును... తెలంగాణ జెఎసి ఇక నిట్టనిలువునా చీలనుంది. రెండు ముక్కలు కానుంది. అందులో ఇప్పుడున్న జెఎసి పౌర వేదికగా ఇలాగే ఒకటి పనిచేస్తది.. గబ్బు పట్టి.. కుల్లిపోతున్న రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు ఇంకో ముక్క పనిచేస్తది. అయితే ఆ ముక్క పార్టీ అయితదా? ఫ్రంట్ అయితదా అన్నది తేలాలంటే ఈనెలాఖరు మటుకు ఆగాల్సిందేనని జెఎసి ఛైర్మన్ కోదండరాం ప్రకటించారు. ఆదివారం ఆయన ఫేస్ బుక్ లైవ్ లో అనేక అంశాలతో పాటు పార్టీ ఏర్పాటుపై కూడా ప్రకటన చేశారు.

రాజకీయ పార్టీ ఏర్పాటుపై తెలంగాణ జెఎసి ఛైర్మన్ మరింత క్లారిటీ ఇచ్చారు. ఇంతకాలం రాజకీయ పార్టీ పెడతారా? లేదా అన్న మీమాంస కొనసాగిన తరుణంలో కోదండరాం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈనెలాఖరులోగా ప్రకటన చేస్తామని చెప్పారు. రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామని.. ప్రక్షాళన కోసం రాజకీయాలు చేస్తామని కోదండరాం ప్రకటించారు. అయితే రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడమా? లేక ఫ్రంట్ రూపంలో రాజకీయాలు చేయాలా అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. రాజకీయాల్లో ఉండాలని మాత్రం నిర్ణయం జరిగిందన్నారు. ఈనెలాఖరులోగా రాజకీయ పార్టీ పెడతామా? లేదా ఫ్రంట్ దిశగా కదులుతామా అన్నది చెబుతామన్నారు.

రాజకీయ ప్రక్షాళన కోసమే తాము రాజకీయాల్లోకి తాము వస్తామని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న తెలంగాణ జెఎసి మాత్రం ఇప్పటిలాగే పౌర వేదికగా పనిచేస్తుందని ప్రకటించారు. ఒకవేళ రాజకీయ పార్టీ పెట్టినా.. ఫ్రంట్ ఏర్పాటు చేసినా.. తాను జెఎసి పౌర వేదికలో పనిచేయాలా? పార్టీ లేదా ఫ్రంట్ లో పనిచేయాలా అన్నది అందరి నిర్ణయం మేరకు నడుచుకుంటానని ప్రకటించారు. ఫేస్ బుక్ లైవ్ లో మరిన్ని అంశాలపై కోదండరాం క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు కింద చదవండి.

ప్రతిపక్షాలు బలంగా ప్రజల గొంతును లేవనెత్తాల్సిన అవసరం ఉంది. కానీ చేయాల్సిన రీతిలో ప్రతిపక్షాలు పనిచేయడంలేదు. కాంగ్రెస్ పార్టీ ఇంకా మరింత మెరుగ్గా పనిచేయాలి. గవర్నమెంటుకు పత్రికలు, టివిలు బాకాలు ఊదుతున్నాయి. అందుకే వార్తల కోసం ప్రజలంతా సెల్ ఫోన్లు చేతబట్టి సోషల్ మీడియాలో వెతుక్కుంటున్నారు. ఆదివాసీలు, లంబాడీల మధ్య వివాదం విషయంలో ప్రభుత్వ వైఫల్యం దారుణంగా ఉంది. నేనేదో ఆషామాషీగా మాట్లాడుతున్నది కాదు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఇంకా ఆదిలాబాద్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వీరి విషయంలో ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా ఉంది. గొడవలు జరుగుతున్నా.. గట్టున కూర్చొని తమాషా చూస్తున్నది సర్కారు. ఈ గొడవలకు ప్రభుత్వానిదే బాధ్యత.

జెఎసి అనేది జెఎసిగానే ఉంటది. జెఎసి డైరెక్ట్ గా పార్టీగా మారి ఆ పని చేయదు. రాజకీయ రంగంలో జోక్యం చేసుకోవడానికి ఇంత వరకు మేము ఎలాంటి ప్రయత్నం చేయలేదు. కానీ.. ఇప్పుడు మా ప్రయత్నం మాత్రం ఉంటది. ఏ రూపంలో రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలన్నదానిపై ఇంకా నిర్ణయం జరగలేదు. ఒక కూటమిగా ఏర్పాటై రాజకీయ మార్పు కోసం పనిచేయాలా? లేక మనమే రాజకీయ పార్టీగా ఏర్పాటై పనిచేయాలా అన్నదానిపై చర్చలు సాగుతున్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒక ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాం. పార్టీనా..? కూటమినా అన్న విషయంలో వారం రోజుల్లో క్లారిటీ ఇస్తాం. అసలు గతంలో రాజకీయాలు చేయాలా వద్దా ? అన్నది ఆలోచించాము. తర్వాత జోక్యం చేసుకోవాలని నిర్ణయించినం. ఇప్పుడు మా ముందు రెండే మార్గాలున్నాయి. 1 పార్టీ.. 2 ఫ్రంట్. కానీ రాజకీయాల్లోకి రావడం మాత్రం ఖాయం. రాజకీయాల్లో మార్పుల కోసం క్రియాశీలక పాత్ర పోశిస్తాము.

అయితే రాజకీయాల్లో ఇప్పటి వరకు జరగనిది ఏంటిది? మనం చేయగలిగిందేమిటి? అన్నదానిపై స్పష్టమైన వైఖరితో రావాలన్న ఉద్దేశంతో ఉన్నాం. తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకున్నాం. కానీ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరే పరిస్థితి లేదు. కోదండరాం జెఎసిలో ఉండాలని అందరు అంటే అట్లనే.. లేదంటే పార్టీలో ఉండాలని అంటే అదే చేస్తా. సిఎం అభ్యర్థి ఎవరనేది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. దాన్ని సంక్లిష్టంగా చేయడం ఇప్పుడే అవసరం లేదు. మనం రాజకీయాల్లోకి రావడం వల్ల ఏం పదవి వస్తదనేది ముఖ్యం కాదు. మనం ఏం మార్చగలం అనేదానికోసం ప్రయత్నం సాగుతది. ఉద్యమకారులకు, ఉద్యమ వీరులకు గౌరవం దొరకాలి.

కొంత మంది అంటున్నారు.. మీదగ్గర పైసలు లేవు.. మీరు కింద మీద చేయలేరు.. మీకు ఇప్పుడు దక్కిన గౌరరవం చాలదా? అని అనేవాళ్లు కూడా ఉన్నారు. పైసలు లేవు కాబట్టి రాజకీయాలు ఎందుకు అని చెప్పేటోళ్లు కూడా ఉన్నారు. అయితే రాజకీయ ప్రక్షాళన కోసం రాజకీయాలు చేయాలని నిర్ణయం మాత్రం తీసుకున్నాం. టిఆర్ఎస్ ను దింపడం కోసమని కాకుండా ప్రజా పాలన సాగే దిశగా మా కార్యాచరణ ఉంటది.

కొందరు టిఆర్ఎస్ నేతలు జెఎసి తో టచ్ లో ఉన్నారన్నదానిపై ఫేస్ బుక్ లైవ్ లో అడిగిన ప్రశ్నకు కోదండరాం స్పందించలేదు.