తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాం తన పదవికి రాజీనామా చేయనున్నారు. శనివారం సాయంత్రం ఐదున్నరకు ఆయన జెఎసి ఛైర్మన్ పదవిని వీడనున్నారు. ఈనెల 29న తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభ జరగనున్న నేపథ్యంలో ఇవాళే కోదండరాం జెఎసి ఛైర్మన్ పదవిని వీడనున్నారు. తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభలో ఆయన పార్టీ అధ్యక్షులుగా నూతన బాధ్యతలు చేపట్టనున్నారు. అందుకే అంతకంటే ముందే జెఎసి ఛైర్మన్ పదవిని వీడనున్నారు.

అమరవీరుల స్థూపం వద్ద ఇవాళ సాయంత్రం కోదండరాం నివాళులు అర్పించి అనంతరం తన పదవిని వీడనున్నారు. సాయంత్రం కోదండరాం తన పదవిని వీడనున్న విషయాన్ని జెఎసి కన్వీనర్ రఘు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే తెలంగాణ జన సమితి పార్టీ ఏర్పాటైనా జెఎసి కంటిన్యూ అవుతుందని కోదండరాం పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాను లేకపోయినా జెఎసి ఉంటుందని గతంలో ప్రకటించారు. తెలంగాణ సర్కారు ఆపరేషన్ ఆకర్ష్ చేయడంతో జెఎసిలో ఉన్న ఉద్యోగ సంఘాలు, చాలావరకు ప్రజా సంఘాలన్నీ జెఎసిని వీడాయి. అప్పట్లో ఎవరు పోయినా జెఎసి పనిచేస్తదని కోదండరాం స్పష్టం చేశారు. ఆయన రాజకీయ పార్టీ బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో జెఎసి కి గుడ్ బై చెప్పనున్నారు.

కోదండరాం తెలంగాణ జెఎసి కి ఛైర్మన్ అయిన తర్వాత ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. సాగరహారం, మిలియన్ మార్చ్, సడక్ బంద్ లాంటి కార్యక్రమాలతో యావత్ తెలంగాణ ప్రజలను ఉద్యమంలో మమేకం చేయడంలో కోదండరాం పాత్ర ఎంతో ఉంది. పలు సందర్భాల్లో టిఆర్ఎస్ నుంచి వత్తిళ్లు వచ్చినా భయపడకుండా కోదండరాం జెఎసిని నడిపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సర్కారు జెఎసి నే తన ప్రథమ శత్రవుగా భావించింది. జెఎసిపై ఉమ్మడి రాష్ట్రంలో లేనంత రీతిలో నిర్బంధం ప్రయోగించింది. కోదండరాం ను అర్థరాత్రి ఇంటి తలుపులు బద్ధలు కొట్టి అరెస్టు చేసిన దాఖలాలున్నాయి. ఆయన ఎక్కడ తిరుగుదామన్నా అనుమతి లేకుండా చేసింది. హైదరాబాద్ దాటి కాలు బయట పెట్టనీయలేదు సర్కారు. ఇదంతా ఒక ఎత్తయితే.. తెలంగాణ సహచర ఉద్యమ నేత అయినప్పటికీ తెలంగాణ సిఎం కేసిఆర్ కోదండరాం మీద తీవ్రమైన తిట్ల భాష ప్రయోగించారు. వాడు, వీడు, లంగా అంటూ కోదండరాం ను ధూషించారు. అయినప్పటికీ కోదండరాం సౌమ్యంగానే భరించారు. 

ఇక తెలంగాణ జెఎసి కి కొత్త సారథి ఎవరవుతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం తెలంగాణ జెఎసిలో కోదంరాం తర్వాత విద్యుత్ జెఎసి నేత రఘు తోపాటు మరికొందరు నేతలు యాక్టివ్ గా పనిచేస్తున్నారు. వారిలో ఎవరో ఒకరు జెఎసి ఛైర్మన్ గా నియమితులయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కోదండరాం తప్పుకున్న తర్వాత తెలంగాణ జెఎసి ఇప్పుడున్నట్లే ఉంటుందా? లేదా అన్నది భవిష్యత్తులో తేలే అవకాశముంది. గతంలో జెఎసి ఛైర్మన్ గా కాకముందు కోదండరాం తెలంగాణ విద్యావంతుల వేదికలో పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ విద్యావంతుల వేదిక మనుగడలోనే ఉంది. కానీ జెఎసి అంతటి స్థాయిలో విద్యావంతుల వేదిక కార్యాచరణ లేదు. మరి జెఎసికి పెద్ద దిక్కుగా ఉన్న కోదండరాం బయటకు వెళ్లిపోయిన తర్వాత జెఎసి మరో విద్యావంతుల వేదికగా మారుతుందా? లేక మునుపటిలాగే తన కార్యాచరణ చేపడుతుందా అన్నది తేలాల్సి ఉంది.