మాకు ఓకె అంటున్న కాంగ్రెస్ సానుకూలంగానే టిడిపి లెఫ్ట్ కలిసి వస్తుందంటున్న కాంగ్రెస్ కాంగ్రెస్ లో పోటీ నివారణ కోసమే

గడ్డి పరకలు ఏకమై ఏనుగును బంధించినట్లు, చీమలన్నీ ఏకమై పామును మట్టుపెట్టినట్లు మనం ఇప్పటి వరకు కథల్లోనే విన్నాము. కానీ నిజ జీవితంలోనూ అలాంటి సీన్ చూడబొతున్నాము. తెలంగాణ రాజకీయాల్లో ఈ సీన్ 2019లో ఆవిష్కృతం కావడం కాయంగా కనిపిస్తోంది.

తెలంగాణ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టిఆర్ఎస్ ఏకచత్రాధిపత్యానికి చరమగీతం పాడేందుకు విపక్షాలన్నీ ఒక్కటిగా జట్టు కట్టబోతున్నాయి. బిహార్ ఫార్ములా ఇక్కడ కూడా అమలులో పెట్టేందుకు పెద్దన్న పాత్రలో కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇక మిగిలిన పక్షాలు కూడా సానుకూలంగానే కనిపిస్తున్నాయి. టిఆర్ఎస్ ను సమర్థంగా ఎదుర్కొనే దమ్మున్న నేత కోదండరాం అన్నవాతావరణం అన్న పార్టీల్లో నెలకొంది.

2019 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నది. తెలంగాణ ఇచ్చిన ఫలితంగా ఎపిలో అడ్రస్ లేకుండా కొట్టుకుపోయింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో మాత్రం టిఆర్ఎస్ అధికారంలోకి రాగా ప్రతిపక్షంలో కూర్చుంది. ఇక ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు లోనై అనేక మంది ఎమ్మెల్యేలకు, కీలక నేతలను చేజార్చుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టిఆర్ఎస్ ను ఒంటరిగా ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని ఇటు రాష్ట్ర పార్టీ, అటు జాతీయ నాయకత్వం అంచనాకు వచ్చాయి.

ఇక వచ్చే ఎన్నికలను మహా కూటమి ద్వారా ఎదుర్కోవాలన్న అంచనా వేస్తోంది కాంగ్రెస్. దీనికోసం ఇప్పటికే ఆ పార్టీ నేతల్లో చర్చలు జోరందుకున్నాయి. ‘‘కాంగ్రెస్ లో ప్రతి నాయకుడు సిఎం అభ్యర్థిగానే చెలామణి అవుతున్నారు కాబట్టి నిజమైన సిఎం అభ్యర్థి కోసం మా పార్టీ అధిష్టానం కోదండరాం పేరును పరిశీలిస్తోంది’’ అని ఒక కాంగ్రెస్ నేత ఏసియా నెట్ తో చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే పార్టీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. చాలా మంది నేతలు సానుకూలంగానే ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

రానున్న ఎన్నికల్లో కోదండరాం పార్టీ పెట్టినా, జెఎసి తరుపున పోటీ చేసినా కూటమి ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ఆకాంక్షిస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నది. దానికోసమే ఇటీవల కాలంలో అధికార పార్టీపై పోరాటం చేయడంలో కాంగ్రెస్ అఖిలపక్షం పేరుతో కదులుతున్నది. నేరెళ్ల బాధితుల విషయంలో సీరియస్ గా విపక్షాల ఐక్యత దిశగా అడుగులేస్తున్నది కాంగ్రెస్. ఇక తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ మహా కూటమి దిశగా అడుగులేస్తున్న సందర్భంలో ఆ పార్టీతో వామపక్షాలు కూడా జట్టు కట్టే అవాకాశాలున్నాయి.

కోదండరాం స్వతహాగా లెఫ్టిస్టు కావడం, ఆయన ఇప్పటికీ లెఫ్ట్ ఐడియాలజీతోనే ప్రజా ఉద్యమాల్లో ఉండడంతో లెఫ్ట్ పార్టీలకు ఆయన సిఎం అభ్యర్థి అంటే పెద్దగా అభ్యంతరం లేకపోవచ్చని చెబుతన్నారు. సిపిఐ, సిపిఎం తోపాటు న్యూ డెమెక్రసీ పార్టీలు కూడా మహా కూటమికి అంగీకరించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇక తెలంగాణలో మిగిలిన పార్టీల్లో ఎంఐఎం, బిజెపి, టిడిపిలలో బిజెపి ఈ కూటమికి దూరంగా ఉండే అవకాశం ఉంది. ఏకోశాన చూసినా బిజెపి కూటమిలో చేరదు. కాంగ్రెస్, లెఫ్ట్ చేరనివ్వవు. ఇకపోతే ఎంఐఎం విషయంలో ఏం జరుగుతుందో ఇప్పట్లో చెప్పలేని పరిస్థితి ఉంది.

ఇక టిడిపి వియయంలో కూడా కోదండరాం సిఎం అభ్యర్థిగా ఉంటే తమకు అభ్యంతరం లేదన్న ధోరణి టిడిపిలో నెలకొంది. దీనికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు దగ్గర కూడా ఈ చర్చ వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దానికి బాబు కూడా సానుకూలంగానే ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో టిడిపి నుంచి లీడర్లు వెళ్లిపోయినా పార్టీ కేడర్ ఇంకా పార్టీ తరుపున నిలబడి ఉన్న పరిస్థితి ఉంది. దీంతో ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేసే సత్తా మాత్రం కోల్పోయింది. ఒంటరిగా పోటీ చేసే చాన్సే లేనప్పుడు ఇక ఆ పార్టీకి సిఎం అభ్యర్థి ఆలోచన కూడా వచ్చే అవకాశమే లేదు. దీంతో టిఆర్ఎస్ కు ధీటైన నేతగా, మాయలు, మచ్చలు లేని క్లీన్ ఇమేజ్ ఉన్న కోదండరాం సిఎం అభ్యర్థిగా ఉంటే ఆ పార్టీకి కూడా ఆమోదమే అవుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.

జయంశంకర్ సార్ వర్ధంతిని పురస్కరించుకుని కోదండరాం భారీ ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ అమరుల స్పూర్తి యాత్రను జయశంకర్ సార్ వర్ధింతినాడు ప్రారంభించారు. ఆ స్పూర్తి యాత్ర ఇప్పటి వరకు 4దశలు పూర్తి చేసుకుంది. ఆ నాలుగు దశలు చూస్తే తొలుత హరీష్ రావు, ఆ తర్వాత కెటిఆర్, తర్వాత కెసిఆర్ నియోజకవర్గాల్లోనే జరిగింది. నలుగో దశ కెసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపి కవిత నియోజకవర్గంలో ప్లాన్ చేశారు కోదండరాం. ఈ పరిణామాలు చూస్తుంటే కచ్చితంగా తెలంగాణలో సాగుతున్న కుటుంబ పాలనపైనే కోదండరాం తొలి సమరం చేపట్టినట్లు తేలిపోతున్నది. దీంతోపాటుగా ప్రాజెక్టుల అవినీతిని కూడా ఆయన ఎండగడుతున్నారు. దీన్ని చూస్తే కెసిఆర్ కుటంబ పాలన టార్గెట్ చేయడం ద్వారా కోదండరాం సిసలైన ప్రతిపక్ష నేతగా రూపాంతరం చెందుతున్నారు.

అన్నీ అనుకున్నట్లు జరిగితే 2019 ఎన్నికల తర్వాత కోదండరాం సిఎం అయ్యే చాన్స్ ఉన్నట్లేనని రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి.