తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాం తాజాగా కొత్త ఇరకాటంలో చిక్కిపోయారు. ఆయన గత కొంత కాలంగా ఒక విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఆయన వైఖరిని యూత్ రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. అందుకే రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. ఇంతకూ కోదండరాం ఇరకాటం దేని గురించి అనుకుంటున్నారా? చదవండి మరి.

గత ఏడాదిన్నర కాలంగా తెలంగాణ జెఎసి ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువగానే రాష్ట్రంలో ప్రజాసమస్యలపై పోరుబాట పట్టింది. కేసిఆర్ సర్కారుపై ముప్పేట దాడి చేస్తోంది. కాంగ్రెస్, టిడిపి, బిజెపి, లెఫ్ట్ పార్టీల కంటే తెలంగాణ సర్కారుకు ఎక్కువ కోపం జెఎసి మీదే కలిగింది. ఏకంగా సిఎం కేసిఆరే నోటికి పని చెప్పాల్సిన వాతావరణం నెలకొంది. కోదండరాంపై వాడు, వీడు, లంగా అంటూ ధూషణలకు సిఎం కేసిఆర్ దిగారంటే.. జెఎసి ఎంతగా సర్కారును ఇబ్బందిపెట్టిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక కోదండరాం రాజకీయ పార్టీ పెడతారా లేదా అన్నది ఇప్పటి వరకు ఎవరికీ అంతుచిక్కడంలేదు. పార్టీ పెడతామని కానీ.. పెట్టేది లేదని కానీ ఇప్పటి వరకు కోదండరాం క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాను లేకపోయినా జెఎసి ఉంటుందని ఆయన స్పస్టత ఇచ్చారు. మరి రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంలో మాత్రం సూటిగా ఇప్పటి వరకు కోదండరాం వెల్లడించలేదు. ఆయన మనసులో మాట ఏంటో తెలియక ఇటు జెఎసి ప్రతినిధులతోపాటు మిగతా రాజకీయ పార్టీల నేతలు సైతం జుట్టు పీక్కునే పరిస్థితి నెలకొంది. జనవరిలో పార్టీ ఏర్పాటు చేస్తారన్న ప్రచారం సాగింది. దానిపై ఇప్పటి వరకు క్లారిటీ మాత్రం రాలేదు.

ఇక టివియువి అనే విద్యార్థి సంఘం కోదండరాం పై వత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇవాళ టివియువి నేతలు కోదండరాం తో భేటీ అయ్యారు. తక్షణమే రాజకీయ పార్టీని స్థాపించాలని వారు కోరారు. గట్టిగానే డిమాండ్ కూడా చేశారు. తర్వాత నిరుద్యోగ యూత్ కోసం కోదండరాం రాజకీయ పార్టీ పెట్టాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వారు కోదండరాం ను కలవడం.. రాజకీయ పార్టీ పెట్టాలంటూ వత్తిడి చేయడం.. పైగా బహిరంగ నినాదాలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీ ఏర్పాటుపై నానుస్తూ వస్తున్న కోదండరాం ఇప్పుడు ఏదో ఒకటి తేల్చి చెప్పాల్సిన పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. రాజకీయ పార్టీ విషయంలో తేలుస్తారా లేదా అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. యూత్ నుంచి, స్టూడెంట్స్ నుంచి వత్తిడి మాత్రం షురూ అయినట్లు ఈ సంఘటనతో చెప్పవచ్చు.

టివియూవి నాయకుల వీడియో కింద ఉంది చూడండి.