‘కేసిఆర్ భూకంపం’ పై కోదండరాం జోక్

Kodandaram heckles KCR statement on National politics
Highlights

హాట్ టాపిక్

హైదరాబాద్ లో ఉండే ఢిల్లీలో భూకంపం పుట్టిస్తా అని ప్లీనరీ వేదిక మీద తెలంగాణ సిఎం కేసిఆర్ గర్జించారు. ఫెడరల్ ఫ్రంట్ కు నాయకత్వం వహిస్తానని, దేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోశిస్తానని ప్రకటించారు.

కేసిఆర్ చేసిన భూకంపం ప్రకటనపై కోదండరాం స్పందించారు. ఫేస్ బుక్ లైవ్ లో ఆయన ఆసక్తికరమైన కామెంట్ చేశారు. కేసిఆర్ చేసిన ప్రకటన అంతా ఉట్టిదే అని కోదండరాం ఎద్దేవా చేశారు. కేసిఆర్ భూకంపం ప్రకటనపై కోదండరాం జోక్ పేల్చారు. కేసిఆర్ ప్రకటనలు, ప్రయత్నాలన్నీ ఢిల్లీలో భూకంపం సృష్టించడం కోసం కాదని తేల్చిపారేశారు. రాజకీయ మార్పుల కోసం అసలే కాదన్నారు. అయినా భారతదేశంలో భూకంపాలు సంభవించే భూకంప కేంద్రం నార్త్ ఇండియాలోనే ఉందన్నారు. సౌత్ లో భూకంపాలు వచ్చే భూకంప కేంద్రం లేదని జోక్ చేశారు.

ఇక ప్రస్తుత దేశ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ అవసరమే లేదన్నారు. ఏదో ఒక జాతీయ పార్టీ లేకుండా ఫ్రంట్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్నారు. చిన్న చిన్న పార్టీలన్నీ ఫ్రంట్ పెడితే రాష్ట్రాల ప్రయోజనాల కోసం ప్రయత్నం చేయగలవు తప్ప అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేదన్నారు. కేసిఆర్ ఇప్పటి వరకు సంప్రదింపులు జరిపిన ఏ ప్రాంతీయ పార్టీ నేతలు కూడా ఆయనే ఫ్రంట్ నాయకుడు అని చెప్పనేలేదన్నారు.

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసిఆర్ చేసే ప్రయత్నమంతా కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తప్ప తెలంగాణ కోసమో, దేశం కోసమో ఏమాత్రం కాదన్నారు. రాజకీయాల మార్పు కోసం అసలే కాదన్నారు. రానున్న ఎన్నికల ముందు కానీ, ఎన్నికల తర్వాత కానీ కేసిఆర్ దిగిపోయి తన కొడుకు కేటిఆర్ ను కుర్చీ మీద కూర్చోబెట్టాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. కొడుకుకు కుర్చీ ఇచ్చిన తర్వాత ఖాళీగా ఉంటే బాగుండదు కాబట్టి ఆయన ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఢిల్లీలో హడావిడి చేయడం కోసం, పతార పెంచుకోవడం కోసం ఆరాటం తప్ప ఇంకో ఉద్దేశం ఏమీ లేదన్నారు. కొడుకు కుర్చీ ఎక్కిన తర్వాత ఖాళీగా ఉండకుండా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో హడావిడి చేయాలని కేసిఆర్ ఆలోచిస్తున్నారని అన్నారు.

loader