ఉద్యోగ ఖాళీలు రెండు లక్షలున్నాయి లక్షల వరకే భర్తీ చేయడం సరికాదు లక్ష్యం మరచి కెసిఆర్ సర్కారు పాలన అమరుల ఆశయాల కోసమే జెఎసి పనిచేస్తున్నది

తెలంగాణ సర్కారు ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నదని జెఎసి ఛైర్మన్ కోదండరాం ఆరోపించారు. రాష్ట్రంలో రెండు లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం లక్ష పోస్టులు భర్తీ చేస్తామని పాలకులు ప్రకటనలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తక్షణమే ఖాళీగా ఉన్న రెండు లక్షల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఖమ్మం పట్టణంలో ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన నిరుద్యోగ సదస్సుకు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పంద్రాగస్టు వేడుకల్లో సిఎం కెసిఆర్ ఉద్యోగాల భర్తీపై చేసిన ప్రకటన సరిగాలేదన్నారు. వెంటనే ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి దాని ప్రకారమే భర్తీ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ తెచ్చుకుందే ఉద్యోగాల కోసమైనప్పుడు అంతటి ప్రాధాన్యత కలిగిన అంశాన్ని తెలంగాణ సర్కారు ఆషామాషీగా తీసుకోవడం దురదృష్టకరమన్నారు. ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి స్థానికులకు అవకాశం కల్పించాలని కోరారు. తెలంగాణ సాధనలో ముందుడి పోరాడామనీ, ఇప్పుడు 1200 మంది అమరుల ఆశయ సాధన కోసం పోరాటం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అసలు లక్ష్యం మరచి ఇసుక కాంట్రాక్టుల కోసం నేరెళ్లలో దాడులు, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులో కమీషన్ల కోసం పనిచేస్తోందని కోదండరాం విమర్శించారు.

ప్రభుత్వం నిరుద్యోగుల ఆకాంక్షలను విస్మరిస్తే తగిన గుణపాఠం చెప్పడానికి యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు కోదండరాం.