ఉస్మానియాలో అగ్గి రాజేసిన కోదండరాం

First Published 29, Nov 2017, 11:38 PM IST
kodandaram campaign in osmania campus for koluvulakai kotlata sabha
Highlights
  • ఉస్మానియా హాస్టళ్లలో కోదండరాం ప్రచారం
  • ఘన స్వాగతం పలికిన ఉస్మానియా విద్యార్థులు
  • కొలువులకై కొట్లాట సభకు తరలివస్తామని హామీ

కొలువులకై కొట్లాట సభకు తెలంగాణ జెఎసి గట్టిగనే ప్రిపేర్ అయితున్నది. తెలంగాణ సర్కారు మెడలు వంచేందుకు యువతను పెద్ద ఎత్తున సమాయత్తం చేస్తున్నది జెఎసి. ఈ సభ కోసం గత మూడు, నాలుగు నెలలుగా జెఎసి తన్లాడుతున్నది. పాలకపక్షం కన్నెర్రజేయడంతో కొలువుల కై కొట్లాట సభ జరిపేందుకు జెఎసి ఎంతో శ్రమించాల్సివచ్చింది. రకరకాల కారణాలు చూపి తెలంగాణ సర్కారు కొట్లాట సభను జరపకుండా చేయడంతో జెఎసి కోర్టు నుంచి అనుమతులు తెప్పించుకోవాల్సి వచ్చింది.

హైకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత తెలంగాణ సర్కారు దిగొచ్చి కొట్లాటకు అనుమతించింది. డిసెంబరు 4వ తేదీన కొట్లాట సభ జరిపి తెలంగాణలో ఉద్యోగాల విషయంలో సర్కారు వైఖరిని ప్రపంచానికి చాటేందుకు జెఎసి భారీగానే సన్నాహాలు చేస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో పోరు జరిపి తెచ్చుకున్న రాష్ట్రంలో మూడో ముచ్చటను సర్కారు అటకెక్కించిందన్న విమర్శలను బలంగా గుప్పిస్తున్నది జెఎసి. 40 నెలల కాలంలో 20వేల కొలువులు నింపడానికి ఆపసోపాలు పడుతున్న సర్కారు మిగిలిన 20 నెలల్లో 80వేల కొలువులు ఎట్లా భర్తీ చేస్తదో లెక్క చెప్పాలని జెఎసి గట్టి పట్టు పడుతున్నది.

కొట్లాట సభ విజవంతం చేయాలంటూ జెఎసి ఛైర్మన్ కోదండరాం కాలుకు బలపం కట్టుకుని ప్రచారం చేస్తుర్రు. నిన్నమొన్న ఆయన వరంగల్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో పర్యటించి కొట్లాటను జయప్రదం చేయాలని యూత్ ను కలుసుకుని జోరుగా ప్రచారం చేసిర్రు. బుధవారం రాత్రి ఉస్మానియా యూనివర్శిటీలో కోదండరాం పర్యటించిర్రు. ఉస్మానియా యూనివర్శిటీలో కోదండరాం కొట్లాటకు అగ్గి రాజేసిర్రు. క్యాంపస్ లోని సి హాస్టల్, ఇ2 హాస్టల్, గోదావరి హాస్టల్ తోపాటు మెయిన్ లైబ్రరీ వద్ద విద్యార్థులతో సమావేశమయిర్రు. 40 నెలలుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఉస్మానియా విద్యార్థి లోకం కోదండరాం క్యాంపస్ హాస్టళ్ల వద్దకు పోగానే బ్రహ్మరథం పట్టింది. పంతులుకు ఉస్మానియా పోరగాళ్లు ఘన స్వాగతం పలికిర్రు.

కొట్లాట సభ ద్వారా సర్కారు మెడలు వంచాలని కోదండరాం పిలుపునిచ్చిర్రు. తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేయకపోతే తెలంగాణ సమాజంలో అశాంతి నెలకొనే ప్రమాదముందని కోదండరాం వివరించిర్రు. కోదండరాం ఉస్మానియాలోని హాస్టళ్లన్నీ కలియదిగిరి ప్రచారం చేసిర్రు. ఈ సందర్భంగా యావత్ ఉస్మానియా కొట్లాట సభకు కదలుతుందని విద్యార్థులు కోదండరాం కు భరోసా ఇచ్చిర్రు. కొట్లాట సభ విజయవంతం చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామంటూ విద్యార్థులు కోదండరాంతో చర్చ సందర్భంగా పేర్కొన్నరు.

40 నెలల కాలంలో తెలంగాణ సర్కారు ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా అదిగో డిఎస్సీ, ఇదిగో డిఎస్సీ అంటూ తీపికబుర్లు చెబుతూ, మాయమాటలతో నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతోందని విద్యార్థులు ఈ సందర్భంగా కోదండరాంతో తమ ఆవేదనను పంచుకున్నారు. వేసిన నోటిఫికేషన్లన్నీ కోర్టుల్లో నానుతూ నిరుద్యోగులను ఎక్కిరిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  దీనిపై కోదండరాం స్పందిస్తూ అందుకే మనం క్యాలెండర్ అడుగుతున్నం. తొలి ఏడాదిలోనే లక్ష కొలువులు భర్తీ చేస్తా అని అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయాలని అడుగుతున్నం. దాంతోపాటు మిగతా ఖాళీలన్నీ కలిపి రెండు లక్షల వరకు ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతున్నామని కోదండరాం వారికి వివరించారు.

శాంతియుత పద్ధతిలోనే తెలంగాణ సర్కారుపై వత్తిడి పెంచేందుకు యూనివర్శిటీ విద్యార్థి లోకం కదలాలని కోదండరాం పిలుపునిచ్చారు. అక్కరకు రాని పథకాల కోసం కోట్ల డబ్బు మంచినీళ్లలా ఖర్చు చేస్తూ లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవితాలు బాగుపడే విషయంలో కొలువుల విషయాన్ని పట్టించుకోవడంలేదని కోదండరాం ఆరోపించారు. మొత్తానికి ఉస్మానియాలోని అన్ని హాస్టళ్ల విద్యార్థులు పెద్ద సంఖ్యలో కోదండరాం కు మద్దతు ప్రకటించిర్రు.

30న జెఎసి స్టీరింగ్ కమిటీ భేటీ

కొట్లాట సభకు తెలంగాణ పోలీసుల నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో గురువారం నాంపల్లిలోని జెఎసి ఆఫీసులో స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు, అన్ని సబ్ కమిటీల సభ్యులు సమావేశమై సభ ఏర్పాట్లపై చర్చిస్తారు. అన్ని జిల్లాల్లో యువతను పెద్ద ఎత్తున కదిలించేందుకు జెఎసి సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఈ స్టీరింగ్ కమిటీ సమావేశం కీలకంగా మారనుందని జెఎసి నేతలు చెబుతున్నారు.

 

loader