తెలంగాణ రాష్ట్రంలో నేడు బంద్ కొనసాగుతోంది. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యాలనే డిమాండ్‌తోపాటూ... మరో 20కి పైగా డిమాండ్లతో సమ్మెకు దిగిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు... ఇవాళ బంద్ తలపెట్టారు. దీంతో... తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఈ బంద్‌కు ప్రజలతోపాటూ... రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు, ఉద్యమ సంఘాలు, సంస్థలు మద్దతు ఇచ్చాయి.

క్యాబ్ లు, ఆటోలు కూడా ఈ బంద్ కి మద్దతు ఇవ్వడం గమనార్హం. ఇన్ని రోజులు బస్సులు లేకపోయినా క్యాబులు, ఆటోలతో ప్రజలు తమ ప్రయాణాలను కొనసాగించారు.నేడు అవి కూడా బంద్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో బంద్ ప్రశాంతంగా సాగుతోంది.

ఇదిలా ఉండగా... ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సికింద్రబాద్‌ జూబ్లీ బస్టాండ్‌ వద్ద బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే ప్రభుత్వం చర్చలు జరపాలని ఈ సందర్భంగా కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులను పోలీసులు అరెస్ట్‌ చేశారు

ఇదిలా ఉండగా...బంద్ నేపథ్యంలో... డిపోల ఎదుట భారీగా పోలీసులను మొహరించారు. అర్ధరాత్రి నుంచి కార్మిక సంఘాల నేతలు ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మె తర్వాత.. అరకొరగా నడుస్తున్న బస్సులను రోడ్డుమీదకు రాకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు. పలుచోట్ల ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులనుకూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.