Asianet News TeluguAsianet News Telugu

కోదండరాం.. రేవంత్ రెడ్డి.. గుసగుస

  • అర గంట సేపు ఏకాంతంగా ఇద్దరు భేటీ
  • కోదండరాం ఇంటికి వెళ్లి పెళ్లి కార్డు ఇచ్చిన రేవంత్
  • కోదండరాం యాక్సిడెంట్ పై వివరాలు అడిగి తెలుసుకున్న రేవంత్
kodandaram and revanth reddy had a secret meeting

మూడు రోజుల క్రితం తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాం ఇంటికి వెళ్లారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. కోదండరాం నల్లగొండ పర్యటనలో భాగంగా చిట్యాల సమీపంలో యాక్సిడెంట్ అయింది. ఆ సంఘటన జరిగిన తర్వాత కోదండరాం ను పరామర్శించేందుకు రేవంత్ రెడ్డి వెళ్లారు. అదే రోజు పాలమూరు సీనియర్ కాంగ్రెస్ నేత జి.చిన్నారెడ్డి కూడా కోదండరాం ను పరామర్శించారు. ఇక రేవంత్ రెడ్డి తో పాటు వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, ఓయు జెఎసి మాజీ నేత రాజారాం యాదవ్ మరికొందరు రేవంత్ సహచరులు, అనుచరులు కూడా కోదండరాం ఇంటికి వెళ్లారు. అక్కడ ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. అదేంటంటే..?

వెళ్లిన వారంతా కోదండరాం ను పరామర్శించారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. యోగ క్షేమాలు విచారించారు. తర్వాత రేవంత్ రెడ్డి తన అన్న కూతరు పెళ్లి కార్డును కోదండరాం కు అందజేశారు. తన అన్న మరణించడంతో తానే ముందుండి ఈ పెళ్లి జరిపిస్తున్నట్లు కోదండరాం కు రేవంత్ వివరించారు. ఈ మాటా ముచ్చట్లన్నీ రేవంత్ తో పాటు వచ్చిన సహచర మిత్రుల ముందే జరిగాయి. ఇక ఆతర్వాత ఒక అరగంట పాటు కోదండరాం, రేవంత్ ఇద్దరూ వేరే గదిలో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏం మాట్లాడుకున్నారబ్బా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా కోదండరాం కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. అతికొద్ది రోజుల్లోనే జెఎసి నేతృత్వంలో రాజకీయ పార్టీ రూపుదిద్దుకోబోతున్నది. పార్టీ ఏర్పాటు నేపథ్యంలో తమతో కలిసి వచ్చే వ్యక్తులు, శక్తులతో కోదండరాం టచ్ లో ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఏ కోశాన చూసినా జెఎసి పార్టీలోకి వెళ్లడం జరిగే పని కాదు. ఎందుకంటే కొద్దిరోజుల కిందటే రేవంత్ రెడ్డి టిడిపి వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయన ఇంకా తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయలేదు. ఉత్తుత్తి రాజీనామా చేసినట్లు టిఆర్ఎస్ రేవంత్ మీద ధ్వజమెత్తూనే ఉన్నది. ఈ పరిస్థితుల్లో రేవంత్.. కోదండరాం ఏకాంతంగా ఏమ్ మాట్లాడుకున్నారన్నది తేలాల్సి ఉన్నది.

అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు కోదండరాం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు.. రానున్న రోజుల్లో పార్టీ పనితీరు లాంటి అంశాల మీద చర్చ జరిగినట్లు చెబుతున్నారు. నేడు తెలంగాణలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయన్న అంశంపై చర్చ జరిగిందని అంటున్నారు. తెలంగాణ ద్రోహులుగా ముద్ర పడిన వారంతా పరిపాలనా కేంద్రం చుట్టూ మొహరించారని, ఇది తెలంగాణ ప్రజలకు తీరని నష్టం చేకూరుస్తుందన్న చర్చ జరిగిందంటున్నారు. ఈ ఏకాంత భేటీలో అమరుల స్పూర్తి యాత్ర సందర్భంగా తన అనుభవాలను కోదండరాం రేవంత్ కు వివరించినట్లు చెబుతున్నారు. అధికార టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నింటినీ ఐక్యంగా ముందుకు తీసుకుపోవాలని సూత్రప్రాయంగా చర్చించినట్లు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios