సారాంశం
Kishan Reddy: రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికి ప్రధాని కార్యక్రామానికి ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులు వస్తారనీ, కానీ.. తెలంగాణ సిఎం మాత్రం అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ఎందుకు రావడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
Kishan Reddy: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను ఏకిపారేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాని మోదీ వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఖండించారు. ఈ తరుణంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. ప్రధాని మోడీ అన్నది ఫాంహౌస్ కుటుంబాన్ని అనీ, అది అర్థం కానట్టు కేటీఆర్ నటించడం తనకు నవ్వు తెప్పిస్తోందని అన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర కుటుంబ పెద్దనేననీ, కానీ.. రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని దళితుడ్ని చేస్తానని చేయకుండా దళితులను ఎందుకు దగా చేశారని ప్రశ్నించారు.
అలాగే.. పోడు భూములకు పట్టాలిస్తానని చెప్పి, ఇవ్వకుండా అడవి బిడ్డలపై కేసులు ఎందుకు పెట్టారని విమర్శించారు. తెలంగాణ నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకుంటున్నారనీ, ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగులను ఎందుకు వంచిస్తున్నారని మండిపడ్డారు. పుడ్ పాయిజన్ అయి విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారనీ, అయినా.. చిన్నారుల ఆరోగ్యంతో ప్రభుత్వం ఎందుకు ఆడుకుంటుందనీ, రాష్ట్రంలో నిత్యం ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతుంటే .. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నాస్త్రాలు సంధించారు. ప్రధాని మోడీ సభకు వచ్చిన ప్రజాస్పందన చూసి కల్వకుంట్ల కుటుంబం ఆగమమవుతుందనీ, ట్రైలర్ కే ఇలా గజగజ వణికిపోతుంటే.. రేపు సినిమా రిలీజ్ అయితే.. మీ పరిస్థితి ఏమిటని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అంతకు ముందు..తెలంగాణ కోసం వేల కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టి.. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని వస్తే .. సిఎం కేసీఆర్ ప్రధానిని కలవటం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన బీజేపీ ప్రజాగర్జన సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ వైఖరితో తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. 9ఏళ్లల్లో రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందని కేంద్రమంత్రి వెల్లడించారు. కానీ , సీఎం కేసీఆర్ మాత్రం కేంద్రం ఏమీ ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ చరిత్రలో నేడు మర్చిపోలేని రోజు అని, సమ్మక్క-సారక్కపేరుతో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుందన్నారు. గిరిజన విశ్వవిద్యాలయానికి సమ్మక్క సారక్క పేరు పెట్టుకోవడం సంతోషకరమని అన్నారు.
తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించినందుకు ప్రధాని మోడీ కి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర పసుపు రైతులు పసుపు కోర్డు కోసం.. ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారనీ, దశాబ్దాల నాటి కలను ప్రధాని సాకారమైందనీ, రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉన్న పసుపు రైతుల కోసం మోడీ గొప్ప నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ కేంద్రం అన్నిరాష్ట్రాలకు ఇచ్చిన మదిరిగానే తెలంగాణకు నిధులు ఇస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.