తొమ్మిదేళ్లలో కేంద్రం తెలంగాణ అభివృద్దికి రూ. 9 లక్షల కోట్లు ఖర్చు చేసింది..: కిషన్ రెడ్డి

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం రూ. 9 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.

Kishan Reddy says Centre has spent Rs 9 lakh cr for Telangana development in last 9 years ksm

హైదరాబాద్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం రూ. 9 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్దకు చర్చకు సిద్దమని ప్రకటించారు. ఆదివారం రోజున ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు రానున్న సంగతి  తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ పర్యటనపై కిషన్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ప్రధాని మోదీ రూ. 13,545 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారని తెలిపారు.

‘‘దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రధాని మోదీ ‘Hira’ మోడల్ (హెచ్-హైవేలు, ఐ-ఇన్ఫోవేలు, ఆర్-రైల్వేలు, ఏ-ఎయిర్‌వేస్‌ల అభివృద్ధి)తో ముందుకు సాగుతున్నారు. తెలంగాణకు రికార్డు స్థాయిలో రూ.1.20 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారులు కేటాయించారు’’ అని కిషన్ రెడ్డి చెప్పారు. రైల్వే బడ్జెట్‌ను కూడా కేంద్రం భారీగా పెంచిందని.. కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాజెక్టులను కాగితాలకే పరిమితం చేసిందని విమర్శించారు. 

‘‘మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే బడ్జెట్‌ను భారీగా పెంచుతోంది. 2014లో తెలంగాణ రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ రూ. 258 కోట్లు. 2023లో రూ 4,418 కోట్లకు పెరిగింది. కాగితాలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రాజెక్టులు చూపించింది. మోదీ ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రత్యేకమైన కార్యాచరణతో మెరుగైన రైల్వే వ్యవస్థ, అత్యాధునిక సౌకర్యాలు, వైఫై సౌకర్యాలు కల్పిస్తున్నారు. రామగుండంలో కేంద్రం ఇప్పటికే 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రాంతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పన జరుగుతుంది. భారతదేశ విద్యుత్ రంగం గత 9 సంవత్సరాలలో గణనీయమైన పురోగతిని సాధించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ కరెంటు కొరత లేదు’’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

ఇక, మోదీ మహబూబ్‌నగర్ పర్యటన సందర్భంగా.. రూ. 505 కోట్లతో నిర్మించిన మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టులో భాగంగా కొత్త లైన్‌ ‘జక్లేర్‌-కృష్ణా’ను జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్-గోవా మధ్య 102 కి.మీ దూరం తగ్గుతుంది. కృష్ణా స్టేషన్ నుంచి ‘కాచిగూడ – రాయచూర్ – కాచిగూడ’ డెమో సర్వీస్‌ను ప్రారంభించనున్నారు. జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి రూ. 6,404 విలువైన పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.2,457 కోట్లతో నిర్మించిన సూర్యాపేట-ఖమ్మం ఫోర్‌లేన్ రహదారి ప్రారంభించనున్నారు. రూ.2,661 కోట్లతో నిర్మించిన హసన్‌ (కర్ణాటక)-చర్లపల్లి ఎల్‌పీజీ పైప్‌లైన్‌ ప్రారంభించారు. రూ.1,932 కోట్లతో చేపట్టనున్న కృష్ణపట్నం(ఆంధ్రప్రదేశ్‌)-హైదరాబాద్‌ ‘మల్టీ ప్రొడక్ట్‌ పైప్‌లైన్‌’కు శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రూ. 81.27 కోట్లతో నిర్మించిన భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios