Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ బీజేపీ ఎన్నిక‌ల మేనిఫెస్టో పై కిషన్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు

G Kishan Reddy: తెలంగాణ  బీజేపీ చీఫ్ జీ.కిష‌న్ రెడ్డి  కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ రెండు పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా దురుద్దేశపూరిత ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయని అన్నారు. ఇదే క్ర‌మంలో త‌మ‌కు కాంగ్రెస్ నుంచి కానీ, కేసీఆర్ నుంచిగానీ సర్టిఫికెట్లు అవసరం లేదని పేర్కొన్నారు. 
 

Kishan Reddy's key comments on Telangana BJP's election manifesto RMA
Author
First Published Nov 12, 2023, 6:35 AM IST

Telangana Assembly Elections 2023:  దీపావళి పండుగ తర్వాత నవంబర్ 30న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ జీ కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో కిష‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ 26, 27 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల సభల్లో ప్రసంగిస్తారని, ఆయనతో పాటు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, యూపీ, గోవా, అసోం ముఖ్యమంత్రులు కూడా రాష్ట్రంలో పలు ర్యాలీల్లో ప్రసంగిస్తారని చెప్పారు.

ఎన్నిక‌ల మేనిఫెస్టో గురించి ప్ర‌స్తావిస్తూ.. "దీపావళి తర్వాత బీజేపీ అనేక కార్యక్రమాలను చేపట్టడం ద్వారా తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది" అని కిష‌న్ రెడ్డి చెప్పారు. అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత బీజేపీ కార్యక్రమాల్లో యువత పెద్దఎత్తున పాల్గొంటున్నారని చెప్పారు. బీజేపీకి చెందిన 111 మంది అభ్యర్థులు, ఎన్‌డిఎ భాగస్వామి జనసేన ఎనిమిది మంది అభ్యర్థులు ఎన్నికల కోసం నామినేషన్ పత్రాలు సమర్పించినట్లు తెలంగాణ బిజెపి చీఫ్ చెప్పారు. ఇదే క్ర‌మంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల తీరుపై మండిప‌డ్డ కిష‌న్ రెడ్డి,  ఆ రెండు పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా దురుద్దేశపూరిత ప్రచారాన్ని సాగిస్తున్నాయని అన్నారు. మాకు కాంగ్రెస్ నుంచి కానీ,  తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు) సర్టిఫికెట్లు అవసరం లేదని అన్నారు. ఆ రెండు పార్టీలు తమ దురుద్దేశపూరిత ప్రచారంతో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో ‘ఆర్థిక ఆరోగ్యం’ పూర్తిగా పాడైపోయిందనీ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.

మజ్లిస్ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుందన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపణలపై కిషన్ రెడ్డి స్పందిస్తూ.. అది ఎప్పుడూ జరగలేదనీ, భవిష్యత్తులోనూ ఎప్పటికీ జరగదని స్పష్టం చేశారు. ఇది సిగ్గుమాలిన ఆరోపణ అనీ, మజ్లిస్ వంటి మతతత్వ పార్టీతో తాము ఎప్పటికీ పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ వల్లే ఆ పార్టీ బలోపేతమైందని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఐదు హామీలతో అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఆ రాష్ట్రానికి నష్టం చేసిందనీ, ఇప్పుడు మరో హామీని జోడించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇప్పటికే తెలంగాణ దివాళా తీయడానికి కారణమయ్యారు. కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఇద్దరూ తమ అభ్యర్థుల చేతిలో ఓడిపోవడం ఖాయమన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios