హైదరాబాద్‌: రామాయణంపై, సీతారాములపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ క్రిటిక్ కత్తి మహేశ్‌పై బీజేపీ శాసనపక్ష నేత కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రచారం కోసం కొందరు వ్యక్తులు మత విశ్వాసాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

కొందరు స్వయం ప్రకటిత మేధావులు రాముడి మీద, రామాయణం మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, అలాంటి వారికి తగిన బుద్ధి చెప్తామని కిషన్ రెడ్డి హెచ్చరించారు.

హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నవారు మరో మతంపై ఇలా నోరు జారగలరా అని ప్రశ్నించారు. కత్తి మహేశ్‌ను ఈ మధ్యే చూస్తున్నానని అన్నారు. "నువ్‌ ఏమన్నా మాట్లాడుకో. కానీ, దేవుళ్ల మీద, మత విశ్వాసాలను కించపరిచేలా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంద"ని హెచ్చరించారు.

 హిందువులను కించ పరుస్తూ మాట్లాడుతున్న వారిపై చర్యలు తీసుకోవడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.