ప్రజలను నమ్మించి గొంతుకోయడం సీఎం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని టీ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

ప్రజలను నమ్మించి గొంతుకోయడం సీఎం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని టీ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ ఈరోజు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మహాధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో కిషన్‌ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి కేసీఆర్‌ చేతిలో బంది అయిందని విమర్శించారు. మిగులు బడ్జెట్​ఉన్న రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని.. రూ.7 లక్షల కోట్ల అప్పలపాలు చేసిందని ఆరోపించారు. 

బీఆర్ ఎస్​ప్రజాప్రతినిధులు భూకబ్జాలు, ఇసుక మాఫియా చేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చకుండా మళ్లీ ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారని.. అయితే ఈ సారి బీఆర్​ఎస్​ను ప్రజలు నమ్మే పరిస్థితే లేదని అన్నారు. ఎన్నికలకు ముందు గారడీ చేయడం కేసీఆర్‌కు అలవాటేనని విమర్శించారు. ప్రజలను నమ్మించి గొంతుకోయడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ. 6 లక్షలు ఇస్తామని చెప్పారని.. ఇప్పుడు రూ. 3 లక్షలే అంటున్నారని.. రేపు 3 పైసలు కూడా ఇవ్వరని అన్నారు. 

మరో 4 నెలల్లో కేసీఆర్​ ఫాంహౌస్​కే పరిమితమవుతారని జోస్యం చెప్పారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందైనా ప్రజలకు మంచి చేసే నిర్ణయాల్ని తీసుకోవాలని కోరారు. మిగిలిన ఈ 4 నెలల్లో అయినా పేదలకు ఇళ్లు కట్టివ్వాలని కోరారు. కేంద్రం వాటా ఎన్ని కోట్లాయినా తీసుకొచ్చే బాధ్యత తమదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని.. రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాలను సాధించడంతో పాటు, ప్రజల సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. 

సీఎంకు ప్రగతి భవన్, మంత్రులు, ఎమ్మెల్యేలకు క్వార్టర్స్, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్లు కట్టించిన కేసీఆర్​కు పేదలకు ఇళ్లు కట్టించలేకపోతున్నారని అన్నారు. పేదవారికి ఇళ్లు రావాలంటే కేసీఆర్​ సర్కార్​ పోవాలని, డబుల్​ఇంజిన్​ సర్కార్​ రావాలని అన్నారు. కట్టిన ఇళ్లను పేదలకు కేటాయించేవరకు బీజేపీ పోరుబాట ఆపేది లేదని స్పష్టం చేశారు.