హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల కుటుంబసభ్యులు గురువారం నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని  డిమాండ్ చేశారు.

గత నెల 27వ తేదీన  శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి సర్వీస్ రోడ్డుపై నలుగురు నిందితులు దిశపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో నలుగురు నిందితులు చటాన్‌పల్లి అండర్‌పాస్ బ్రిడ్జి వద్ద  పోలీసులపై దాడికి పాల్పడి తప్పించుకొనే ప్రయత్నం చేశారు.

నిందితులు పోలీసుల నుండి రివాల్వర్ లాక్కొని తప్పించుకొనే ప్రయత్నం చేశారు.  ఈ క్రమంలో పోలీసుల కాల్పుల్లో నలుగురు నిందితులు మరణించారు. ఈ నెల 6వ తేదీన పోలీసుల కాల్పుల్లో నలుగురు నిందితులు మృత్యువాత పడ్డారు.  

ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న నలుగురు నిందితుల కుటుంబసభ్యులు గురువారంనాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై కూడ  ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని  సుప్రీంకోర్టును కోరారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి పోలీసులపై చర్యలు తీసుకోవాలని  ఆ పిటిషన్‌లో కోరారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన నిందితుల మృతదేహాలను భద్రపర్చాలని  తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ ఎన్‌కౌంటర్‌పై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ  వచ్చే వారంలో  తెలంగాణలో పర్యటించే అవకాశం ఉంది.

ఈ కమిటీ సభ్యులు మృతదేహాలను పరిశీలించే అవకాశం ఉంది. తెలంగాణ హైకోర్టుతో పాటు  జాతీయ మానవ హక్కుల సంఘం విచారణలను కూడ సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఆరు మాసాల్లో  ఈ కేసుపై నివేదికను ఇవ్వాలని  సుప్రీంకోర్టు ఆదేశించింది.