రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అయితే.. అతను చనిపోని విషయం తెలియని అతని అన్న కొడుకు.. ఆ శవం మీదే నిద్రపోవడం గమనార్హం. ఈ సంఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మర్కూక్‌ మండలం నర్సన్నపేటకి చెందిన ఎక్కలదేవి ఐలయ్య(28) శనివారం రాత్రి పది గంటల సమయంలో జగదేవ్‌పూర్‌ మండలం తిమ్మాపూర్‌లోని తన బావ వద్దకు అన్న కొడుకు మోక్షిత్‌ (4)ను బైక్‌పై ఎక్కించుకొని వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాంనగర్‌  సమీపంలోకి రాగానే రోడ్డుపై ధాన్యం కుప్పలు రాశులుగా కవరు కప్పి ఉన్నాయి. చీకట్లో ధాన్యం కుప్పలు కనిపించకపోవడంతో ఓ కుప్పను ఢీకొట్టి ఎగిరి ఇద్దరూ రోడ్డు కింద పడిపోయారు.


ఐలయ్య తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. రాత్రి సమయం కావడంతో అటువైపు ఎవరూ రాలేదు. గాయాలతో షాక్‌కు గురైన బాలుడు ఏడుస్తూ బాబాయ్‌ మృతదేహంపైనే తల ఆనించి పడుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున వ్యవసాయ పనుల కోసం వెళ్తున్న ఓ రైతు గమనించి గ్రామస్తులకు చెప్పాడు. గ్రామస్తులు వచ్చి చూసేసరికి బాలుడు బాబాయ్‌ మృతదేహంపై తలపెట్టి పడుకుని ఉన్నాడు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన సర్పంచ్‌ భానుప్రకాశ్‌రావు బాలుడిని గజ్వేల్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది.