బంధువుల ఇంట్లో వివాహానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం బారిన పడి  ఇద్దరు మహిళలు ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

ఖమ్మం పట్టణంలోని బంధువుల ఇంట్లో పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు కొంతమంది ఓ ఆటోలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పట్టణంలోని శ్రీశ్రీ సర్కిల్ వద్ద వేగంగా వచ్చిన ఓ లారీ వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో పెద్దపల్లికి చెందిన శ్రీలత, గోపాలపురానికి చెందిన కమల అనే మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. ఆటోలోని మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం మహిళల  మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఖమ్మం ఏరియా ఆస్పత్రికి తరలించారు.  ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.  మితిమీరిన వేగంతో ఆటోను నడిపిన డ్రైవర్ ఈ ఇద్దరు మహిళల్ని బలితీసుకున్నాడని తెలిపారు.