అమెరికాలో ఖమ్మం విద్యార్థి హఠాన్మరణం చెందారు. అమెరికాలోని బార్బ డోస్ లో ఎంబీబీఎస్‌ చదువుతున్న హేమంత్ శివరామకృష్ణ (20) అనే విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. 2021లో   బార్బడోస్ కు వెళ్లారు. 

ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా తర్వాత యువకుల్లో గుండెపోటులు ఎక్కువయ్యాయి. డ్యాన్స్‌ చేస్తూ ఒకరు, జిమ్‌ చేస్తూ ఒకరు, ప్రయాణిస్తూ ఒకరు ఇలా.. ఒకేసారి కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా అమెరికాలో ఖమ్మం విద్యార్థి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు.

వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం గ్రామీణ మండలం సాయిప్రభాత్ నగర్ లో నివాసముంటున్న టి రవికుమార్‌ ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు హేమంత్‌ శివరామకృష్ణ (20) అమెరికాలోని బార్బడోస్‌లో ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతడు తన ఫ్రెండ్స్ తో కలిసి.. మంగళవారం సమీపంలోని బీచ్‌కు వెళ్లాడు.

ఈతకు వెళ్లి వచ్చిన హేమంత్‌.. కొద్ది సేపటికి గుండెపోటుతో కుప్పకూలాడు. దీంతో అప్రమత్తమైన స్నేహితులు.. చికిత్స కోసం హుటాహుటీన హేమంత్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది. హేమంత్‌ శివరామకృష్ణ మృతితో అతని కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అమెరికాలోకెళ్లి డాక్టరై తిరిగి వస్తానని భావిస్తే.. తమ కుమారుడు విగత జీవిగా మారాడని విలపిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం ఛాయలు అలుముకున్నాయి.