ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఓ యువకుడికి అనుకోని షాక్ తగిలింది. పెళ్లైన కొద్ది రోజులకే భార్య అస్వస్థతకు గురైంది. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా డాక్టర్లు ఆమె గర్భవతి అని తేల్చారు. విషయం ఆరా తీస్తే తాను మరొక యువకుడిని ప్రేమించానని ఆ నవవధువు చెప్పింది. పెద్దలు తన మాట వినకుండా బలవంతంగా ఈ పెళ్లి జరిపించారని బోరుమంది. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థంకావడం లేదని కంటతడి పెట్టింది.

విషయం తెలిసిన వెంటనే ఆ యువకుడు తన భార్యకు విడాకుల నోటీస్ పంపించాడు. చేసేదేంలేక ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. ఇంతకీ విషయం ఏంటంటే.. 

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..కూసుమంచి మండలం నర్సింహులు గూడెంకు చెందిన కళ్యాణ్, నేలకొండపల్లి మండలం చెరువు మాదారంకు చెందిన యడవల్లి పావని గత రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని భావించారు. కానీ, పెద్దలు వారి ప్రేమను అంగీకరించలేదు.

పావని కుటుంబ సభ్యులు ఆమెకు మరొక సంబంధం చూసి వివాహం జరిపించారు. అయితే.. పెళ్లైన కొద్ది రోజులకే ఆమె అస్వస్థతకు గురవగా.. స్థానిక అస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. దీంతో ఆమె అప్పటికే గర్భవతి అని భర్తకు తెలిసింది. వెంటనే విడాకులు ఇచ్చేశాడు.

దిక్కుతోచని పరిస్థితుల్లో పావని ఖమ్మం షీ టీం సీఐ అంజలిని కలిసింది. తన ప్రేమ విషయం, పెళ్లి విషయం గురించి చెప్పి సాయం కోరింది. సీఐ అంజలి వెంటనే పావని తల్లిదండ్రులను, ఆమె ప్రేమించిన యువకుడి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. 

అందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి, ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించారు. వారిద్దరికీ పెళ్లి జరిపించడానికి నిర్ణయించారు. పావని గర్భవతి కావడంతో వెంటనే పెళ్లి జరిపించలేదు. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ పెళ్లి జరిగింది. అధికారులందరూ ఆ జంటను ఆశీర్వదించారు.